హైదరాబాద్: ఆర్టీసీని బతికించేందుకే తాము సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. సమ్మె నోటీసుపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ముగ్గురు ఐఏఎస్ ల కమిటీతో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. 

అయితే చర్చలు జరుగుతున్న సమయంలో ఆకస్మాత్తుగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు బయటకు వచ్చేశారు. ప్రజా రవాణాను కాపాడేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజలు మద్దతు పలకాలని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థను బతికించేందుకు తాము చేస్తున్న పోరాటానికి సహకరించాల్సిందిగా కోరారు.

శుక్రవారం అర్థరాత్రి నుంచి సమ్మె యధాతథంగా జరుగుతుందని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కమిటీ నేత అశ్వద్థామరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి బస్సులు సర్వీసులు నిలిచిపోనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమపై పీడీ యాక్టు, ఎస్మా అస్త్రాలను ప్రయోగించాలని చూస్తుందని ఆర్టీసీ కార్మికులకు ఇటువంటివి కొత్తేమీ కాదన్నారు. నాలుగున్నర కోట్లు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగులం అంతా పోరాటం చేసి అనేక కేసులు ఎదుర్కొన్నామని తెలిపారు. 

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను బతికించేందుకు మరో పోరాటానికి తాము దిగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నియమించిన కమిటీ తమమాటను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. తాము ఎవరి చేతుల్లో కీలుబొమ్మలం కాదని తెలిపారు. 

మెుక్కవోని ధైర్యంతో, కార్మికులు ఐకమత్యంతో ముందుకు వచ్చి పోరాటంలో కలిసి రావాలని కోరారు. ఆర్టీసీని బతికించాలనే ఉద్దేశం డిపో మేనేజర్లకు ఉంటే వారంతా తమతో కలిసి రావాలని కోరారు. 

ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితులో ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి దశ, దిశా నిర్దేశం చేయాల్సిన సీనియర్ ఐఏఎస్ లు తమకు మద్దతు ప్రకటించాలని, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నామని అయితే వారి చేతుల్లో ఏమీ లేదని స్పష్టం చేశారు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు.