హైదరాబాద్: తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ సమ్మెపై చొరవచూపాలంటూ ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ను కలిశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నెలకొన్న పరిణామాలు, కోర్టు ఉత్తర్వులు, ఆర్టీసీ యాజమాన్యం తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు నేతలు. 

కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వంతో తాను మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. 

ఆర్టీసీ కార్మికుల జీతాలకు సంబంధించి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అశ్వత్థామరెడ్డి. రోజూ బస్సులు తిప్పుతున్నామని చెప్తున్న ఆర్టీసీ అధికారులు జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవనడాన్ని తప్పుబట్టారు. ఆర్టీసీ డబ్బులను ఎవరి ఖజానాకు తరలించారో ఆర్టీసీ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

జీతభత్యాలకు సంబంధించి రూ.105 కోట్లు ఇస్తుండగా దాన్ని రూ.200 కోట్లకు పైగా చెప్పడాన్ని సరికాదన్నారు. రోజుకు 95 శాతం బస్సులు నడుపుతున్నామని చెప్తున్న ప్రభుత్వం ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పాలని నిలదీశారు. గత నెల జీతాలకు సంబంధించి రూ.105 కోట్లు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. రూ.7కోట్ల 50 లక్షలే ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు. 

ఆర్టీసీని లాకౌట్ చేయడం ఎవరి తరం కాదన్నారు అశ్వత్థామరెడ్డి. ఇంట్లో కూర్చుని చట్టాలు తయారు చేద్దామంటే అది కుదరదన్నారు. ఇంట్లో కూర్చుని ఆరు నెలలు ఉద్యోగం చేసినా వారిని తొలగించలేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 

కేసీఆర్ పై అశ్వత్థామరెడ్డి ఫైర్: 
ఆర్టీసీ ఆస్తులు ఎవరి జాగీరు కాదని స్పష్టం చేశారు అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ ఆస్తులు కార్మికుల కష్టమేనని చెప్పుకొచ్చారు. రక్తమాంసాలు ఒడ్డించి మరీ సంపాదించుకున్నామని తెలిపారు. ప్రజల యెుక్క ఆశీస్సులతోనే ఈ ఆస్తులను సంపాదించామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకునేందుకు, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకునేందుకు ఈ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. 

ఆర్టీసీ లాకౌట్ చేయడం ఎవరితరం కాదన్నారు అశ్వత్థామరెడ్డి. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని చెప్పుకొచ్చారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సైతం తమను ఇలాగే బెదిరించారని అప్పుడే భయపడలేదన్నారు. తాము తెలంగాణ ప్రజలమని ఆ తర్వాతే ఉద్యోగులమని ఆనాటి ముఖ్యమంత్రికే తెగేసి చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. 

ప్రస్తుతం అలాంటి ఉద్యమమే చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టొద్దని ఉద్యమ నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు చెప్తున్నానని చెప్పుకొచ్చారు. కొల్లగొట్టాలని ప్రయత్నిస్తే తాము ఎంతటి వరకు అయినా తెగిస్తామన్నారు. కోర్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ దిగొచ్చి తమను చర్చలకు ఆహ్వానిస్తారని చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వం చర్చలకు పిలిచేవరకు తాము సమ్మె విరమించేది లేదన్నారు. తమకు సమ్మె చేయడం ఆందోళన చేయడం అలవాటు అయిపోయిందన్నారు అశ్వత్థామరెడ్డి. ప్రభుత్వం దిగిరావాల్సిందేనని స్పష్టం చేశారు.