శనివారం జరిగిన చర్చల్లో తమను ఖైదీల మాదిరిగా ట్రీట్ చేశారంటూ మండిపడ్డారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టీఎంయూ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చర్చలకు ఎప్పుడు పిలిచినా తాము సిద్ధమేనని ప్రకటించారు. తాము కోరిన డిమాండ్లపై చర్చ జరగాలి కానీ.. కేవలం 21 అంటే కుదరదని అశ్వత్థామరెడ్డి తేల్చి చెప్పారు.

చర్చల నుంచి మధ్యలోనే వెళ్లిపోయింది అధికారులేనని తాము కాదని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకాలన్న ఆయన సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు.

సమ్మెలో భాగంగా రేపు అన్ని కలెక్టరేట్ల ముందు నిరసనకు దిగుతామని.. 30న సరూర్‌నగర్‌లో సకల జనుల సభ నిర్వహిస్తామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఎల్లుండి అన్ని రాజకీయ పార్టీలను కలుస్తామని.. 30 నుంచి సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. 

Also Read:చర్చలు ఫెయిల్, అసలు లోగుట్టు ఇదే: వాళ్లు వెళ్లిపోయారు, వీరు ఉండిపోయారు

రెస్పాండెంట్ 6 ప్రకారం ఆర్టీసీ జేఏసీ తరపున లేవనెత్తిని 26అంశాలమీద లేదా రెస్పాండెంట్ 7 ప్రకారం టీఎంయూ లేవనెత్తిన 45 అంశాలపైనా చర్చ జరపాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. అందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించలేదు. దాంతో చర్చలను అర్థాంతరంగా ముగించేశారు. 

చర్చలు విఫలం చెందడానికి ఆర్టీసీ యాజమాన్యం, ఐఏఎస్ అధికారుల వ్యవహరించిన తీరేనని చెప్పుకొచ్చారు. సమావేశం నుంచి తాము అర్థాంతరంగా రాలేదని అధికారులు వెళ్లిపోయిన తర్వాత మాత్రమే తాము బయటకు వచ్చేశామని ఆరోపించారు. 

కంటితుడుపు చర్యల్లో భాగంగానే చర్చలు జరిపారని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం తీరును తప్పుబడుతుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏదో చేశామన్న రీతిలో చర్చలకు ఆహ్వానించారని కానీ ఒక్క అంశంపై కూడా చర్చ జరపకుండానే వారు వెళ్లిపోయారని ఆరోపించారు. 

అయితే ఆర్టీసీ జేఏసీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఐఏఎస్ అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు తాము చర్చలు జరిపినట్లు తెలిపారు. కోర్టు ఆదేశించిన డిమాండ్లపైనే చర్చిస్తామని తాము చెప్తే అన్ని డిమాండ్లు చర్చించాలని జేఏసీ నేతలు పట్టుబట్టారని ఆరోపించారు ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ. 

చర్చలు జరుగుతుండగానే మళ్లీ వస్తామని చెప్పి వారు వెళ్లిపోయారని నాలుగు గంటలు దాటినా రాలేదని చెప్పుకొచ్చారు.  హైకోర్టు 21 అంశాలపైనే చర్చలు జరపాలని ఆదేశించిందని దాని ప్రకారమే చర్చలు జరిపామనన్నారు.

Also Read:మమ్మల్ని భయపెట్టారు, సమ్మె ఆపేది లేదు: చర్చల తర్వాత అశ్వత్థామ రెడ్డి

తమ వారితోమాట్లాడతామని చెప్పి వెళ్లి రాలేదని ఆరోపించారు.కార్మికులతో గంటన్నరపాటు చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం విలీనం మినహా మిగిలిన అంశాలపై చర్చిద్దామన్నా కార్మిక నేతలు అంగీకరించలేదన్నారు.

మరోవైపు తమవాళ్లతో మాట్లాడి వస్తామని చెప్పి జేఏసీ నేతలు వెళ్లిపోయారని ఇప్పటి వరకు రాలేదని రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. ఫోన్లు లాక్కుని నిర్బంధంగా చర్చలు జరిపారన్న ఆరోపణలపై స్పందించిన ఆయన మధ్యలో ఫోన్లు వస్తే చర్చలకు అంతరాయం అనే ఉద్దేశంతో ఫోన్లు అనుమతించలేదన్నారు. ఈడీలు చర్చల్లో పాల్గొనాలని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. 

మెుత్తానికి అటు ఆర్టీసీ జేఏసీ నేతలు, ఇటు అధికారుల మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ చర్చలు మాత్రం జరగలేదన్నది వాస్తవం. సమ్మె తర్వాత జరిగిన చర్చలు నేపథ్యంలో అంతా ఆతృతగా ఎదురుచూశారు. అయితే చర్చలు ఎటూ ముందుకు పడకపోవడంతో ప్రతిరథ చక్రాలు మళ్లీ డిపోలకే పరిమితంకానున్నాయి.