హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంపై ఆర్టీసీ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించిన ఆర్టీసీ యాజమాన్యంతో నిర్బంధకాండ ప్రదర్శించిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. 

ఆర్టీసీ యాజమాన్యం చర్చల పేరుతో తమను భయపెట్టాలని చూసిందని ఆరోపించారు. చర్చలకు వెళ్తున్నప్పుడు ఒకానొకదశలో భయం కూడా వేసిందన్నారు. తమ సెల్ ఫోన్లు గుంజుకున్నారని ఆరోపించారు. 

ఆర్టీసీ జేఏసీ లేవనెత్తిన అంశాలపై అధికారులు చర్చించలేదని చెప్పుకొచ్చారు. అసలు చర్చలే జరగలేదని తెలిపారు. ఐఏఎస్ అధికారులు 21 డిమాండ్లపైనే చర్చించాలని తమపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు.  

సమావేశంలో మధ్యలో బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారని దుమ్మెత్తిపోశారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పించి ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. బలవంతంగా ఐఏఎస్ అధికారులు తీసుకువచ్చిన హామీలకు అంగీకరించేలా తమపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు కేవలం కంటితుడుపు కోసమే చర్చలు జరిపారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేశామనే ఉద్దేశంతోనే చర్చలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. అసలు చర్చలు జరపనేలేదని స్పష్టం చేశారు. 

హై కోర్టు ఉద్దేశాలను పక్కన పెట్టి చర్చలు  జరిపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఆర్టీసీ యాజమాన్యం చర్చలు విశ్వాసం కల్పించేలా ఉండాలే తప్ప కంటితుడుపుగా ఉండకూడదని విమర్శించారు. శత్రు దేశాలతో చర్చలు జరిపేటప్పుడు ఎంతో హుందాగా జరుపుతారని కానీ తమతో చర్చలు మాత్రం ఏదో శత్రువులతో జరిపినట్లుగా పిలిచారని మండిపడ్డారు. 

జేఏసీయే సానుకూలంగా చర్చలు జరపకుండా చేసింది అని కోర్టుకు తెలిపేందుకు కుట్రలో భాగంగానే చర్చలకు ఆహ్వానించారని మండిపడ్డారు. రెస్పాండెంట్ 6, రెస్పాండెంట్ 7 ప్రకారం చర్చలు జరపాలని కోరినప్పటికీ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. 

కోర్టు కోసమే చర్చలు అంటే ఉపయోగం లేదని జేఏసీ నేతలు చెప్పుకొచ్చారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలు నిర్వహిస్తే మంచిదని సూచించారు. అన్ని అంశాలపై చర్చలు జరపాలని హైకోర్టు చెప్పినప్పటికీ 21పైనే చర్చలు జరపాలని డిమాండ్ చేయడం మంచిది కాదన్నారు. 

ముందు చర్చలు జరపాలని ఆ చర్చల్లో ఏది సాధ్యమో ఏది అసాధ్యమో తేలుతుందన్నారు. ఏ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదో, ఏ డిమాండ్లను నెరవేరుస్తుందో యూనియన్ నేతలు ఏ డిమాండ్లను వదులుకుంటుందో తేలుస్తుందన్నారు. 

ఐఏఎస్ అధికారులు పెట్టిన షరతులపై తమ నాయకులతో చర్చించేందుకు కూడా వీలులేకుండా ఒక నిర్బంధకాండలో చర్చలకు తీసుకెళ్లారని మండిపడ్డారు. 21 డిమాండ్లపై యూనియన్ నేతలతో చర్చించేందుకు అంగీకరించలేదన్నారు.

పూర్తి డిమాండ్లపై చర్చించేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆ ఇబ్బందులను అధిగమించేందుకు తాము చర్చలకు వచ్చినట్లు తెలిపారు. 

ఐఏఎస్ అధికారుల చర్చల్లో కనీసం ఆర్టీసీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లును బంధించి చర్చలకు వచ్చారని ఇవెక్కడి చర్చలు అని నిలదీశారు. ఆర్టీసీకి సంబంధించి అవగాహన ఉన్న అధికారులు చర్చలకు వస్తే ఉపయోగం ఉంటుందని కానీ మున్సిపల్ అధికారులు వస్తే ఏం పరిష్కారం అవుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రశ్నించారు.