ఇప్పటికే ప్రశ్నాపత్రాల లీకేజ్‌తో పరువు పొగొట్టుకున్న టీఎస్‌పీఎస్సీ రేపటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్ధులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని టీఎస్‌పీఎస్సీ హెచ్చరించింది.
రేపటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. ఇటీవల ప్రశ్నాపత్రాలు లీకైన నేపథ్యంలో రేపటి పరీక్షకు కమీషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసివేస్తామని పేర్కొంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.
పరీక్షల సందర్భంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. వారు భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా చేయాలని కమీషన్ నిర్ణయించింది. అభ్యర్ధులు బూట్లు వేసుకుని రాకూడదని, బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్‌తోనే సమాధానాలు బబుల్ చేయాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
Also Read: టీఎస్‌పీఎస్‌పీ పేపర్ లీక్ లో రూ. 1.63 కోట్ల లావాదేవీలు: చార్జీషీట్ దాఖలు చేసిన సిట్
కాగా.. తెలంగాణలోని 33 జిల్లాల్లోని 994 సెంటర్‌లలో ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు అథారిటీ ఆఫీసర్లుగా జిల్లా కలెక్టర్లను, చీఫ్ కో ఆర్డినేటర్లుగా సబ్ కలెక్టర్‌లను నియమించింది. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లుగా 1995 మంది అధికారులు వ్యవహరించనున్నారు. వీరికి ఇప్పటికే శిక్షణను పూర్తి చేసింది. 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించింది. ఈలోపు పేపర్ లీక్ కావడంతో కమీషన్ .. సదరు పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్త షెడ్యూల్ ప్రకటించింది.
