తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. లీక్ అయిన పేపర్‌ను విక్రయించడంలో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. రాజేశ్వర్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను రూ.40 లక్షలకు విక్రయించినట్టుగా కనుగొన్నారు. ఇప్పటికే నిందితులకు రూ.23 లక్షలు అందజేయగా.. మిగిలిన మొత్తం పరీక్ష తర్వాత ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లుగా గుర్తించారు. ఇందులో రూ. 8.5 లక్షలను సిట్ అధికారులు రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కేతావత్ రాజేశ్వర్.. ఏ-5గా ఉన్న సంగతి తెలిసిందే.
పేపర్ లీక్ వ్యవహారంలో కీలకంగా వ్యవహిరించిన ప్రవీణ్.. రేణుకకు ఏఈ పేపర్లను ఇచ్చాడు. నమ్మకమైన వారికే పేపర్లను విక్రయించాలని సూచించాడు. ఇందుకు తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని చెప్పి.. రూ. 5 లక్షలు అడ్వాన్స్‌డ్‌గా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే రేణుక భర్త డాక్యా.. వారి బంధువు కేతావత్ రాజేశ్వర్‌కు ఈ విషయం చెప్పాడు. డాక్య నుంచి ఏఈ పేపర్లు తీసుకున్న రాజేశ్వర్.. గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ. 40 లక్షలకు విక్రయించాడు. వారి నుంచి రూ. 23 లక్షలు తీసుకున్నాడు. అందులో నుంచి రూ. 10 లక్షలు ఇచ్చాడు. రాజేశ్వర్ నుంచి తీసుకున్న మొత్తంలో నుంచి రూ. 5 లక్షలను డాక్యా ప్రవీణ్‌కు ఇచ్చారు.
ఈ డబ్బులను నిందితులు వివిధ అవసరాలకు వినియోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ వద్ద నుంచి కూడా కొంత మొత్తం డబ్బును పోలీసులు రికవరీ చేశారు. ఇక, ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు.. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్, బోర్డు సభ్యుడు లింగారెడ్డిని ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు.
