తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసును ఈడీ విచారిస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈడీ, సిట్‌లు న్యాయ పోరాటానికి దిగాయి. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను పంచుకోవడానికి సిట్ నిరాకరించడంతో ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ వివరాలు, పత్రాలను తమకు అందజేయాలని నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది.
ఈడీ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈడీ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ సిట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని.. ఈ తరుణంలో పత్రాలు, దర్యాప్తు వివరాలను అందజేస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని సిట్ పేర్కొంది. ఇక, ఇందుకు సంబంధించిన విచారణను ఏప్రిల్ 13కి కోర్టు వాయిదా వేసింది.
మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌లను విచారించేందుకు అనుమతి కోసం ఈడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన విచారణ కూడా ఏప్రిల్ 13కు వాయిదా పడింది.
ఇక, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇద్దరు టీఎస్‌పీఎస్సీ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ, అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణలకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. ఏప్రిల్ 13న విచారణకు హాజరుకావాలని కోరింది.
