తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీక్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీక్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సబంధించి ఇద్దరు టీఎస్‌పీఎస్సీ అధికారులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకరలక్ష్మీ, అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణలకు నోటీసులు జారీ చేసిన ఈడీ.. ఏప్రిల్ 13న విచారణకు హాజరుకావాలని కోరింది. ఈ క్రమంలోనే శంకరలక్ష్మీ ఈరోజు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు.. శంకరలక్ష్మీ వాంగ్మూలం నమోదు చేయనున్నారు. శంకరలక్ష్మీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్‌గా ఉన్న నేపథ్యంలో.. ప్రవీణ్, రాజశేఖర్‌లకు ప్రశ్నపత్రాలు ఎలా చేరాయనే వివరాలను ఈడీ ఆరా తీయనుంది. ఇక, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌కు సంబంధించి సిట్ నమోదు చేసిన కేసులో శంకరలక్ష్మీని పేర్కొన్న సంగతి తెలిసిందే.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ వ్యవహారంలో పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతుంది. 

మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌లను విచారించేందుకు అనుమతి కోసం ఈడీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.