Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. రేణుకకు బెయిల్.. కానీ ఈ షరతులు పాటించాల్సిందే..!!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకా రాథోడ్‌కు బెయిల్ లభించింది. 

tspsc paper leak case court grants bail to renuka ksm
Author
First Published May 11, 2023, 9:40 AM IST

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుకా రాథోడ్‌కు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు  రేణుకకు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని కోర్టు పేర్కొంది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ కేసును దర్యాప్తు  చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. పాస్‌పోర్టు సమర్పించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అయితే గతంలో కూడా రేణుక బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి బెయిల్ పిటిషన్‌పై రేణుక తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమె అనారోగ్యం, దర్యాప్తు అంతిమ దశలో ఉందన్న కారణాలపై బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు రేణుకకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక, ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు.. రాజేందర్, రమేష్ కుమార్‌లకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఐదుగురు నిందితులను ప్రశ్నించేందుకు కస్టడీకి అనుమతించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. వివరాలు.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ కూడా విచారణ జరపుతుంది. 

ఈ క్రమంలోనే ఈ కేసులో అరెస్ట్ అయి చంచల్‌గూడ జైలులో ఉన్న రేణుకా రాథోడ్, డాక్యా నాయక్, నేతావత్ రాజేశ్వర్, ఫతావత్ గోపాల్ నాయక్, షమీమ్‌ల వాంగ్మూలాలు నమోదు చేయాలని ఈడీ భావించింది. ఈ క్రమంలోనే వీరిని కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కౌంటర్ దాఖలు చేయడం ద్వారా ఈడీ చర్యను వ్యతిరేకించింది. ఇక, ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios