త్వరలో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం

తెలంగాణలో ఐదు గురుకుల సొసైటీల ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి ఇటీవల వెలువరించిన నోటిఫికేషన్‌ను రద్దుచేస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

నిబంధనల్లో సవరణల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సంబంధిత శాఖల నుంచి సవరణలు వచ్చిన తర్వాత మరో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు పీయస్సీ అధికారులు తెలిపారు.

ఇటీవల 6 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసేందుకు టీఎస్పీయస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికోసం తొమ్మిది నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదల చేశారు.

అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పీయస్సీ పేర్కొన్న నిబంధనలపై అభ్యర్థుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ముఖ్యంగా మూడేళ్లు ఉపాధ్యాయ వృత్తిలో అనుభవం, ఆంగ్లంలోనే పరీక్ష నిర్వహణ, టెట్ మార్కులకు వెయిటేజీ రద్దు, డిగ్రీ, బీఎడ్ లలో ఫస్ట్ క్లాస్ మార్కులు తదితర నిబంధనలు అభ్యర్థుల పాలిట శాపంగా మారాయి.

దీంతో అభ్యర్థులు ఈ నిబంధన సడలింపునకు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. సీఎం కేసీఆర్ దృష్టికి కూడా ఈ విషయం వెల్లడంతో ఆయన దీనిపై స్పందించి నిబంధనలను మార్చాలని టీఎస్ పీయస్సీ అధికారులకు సూచించారు.

ఈ మేరకు మొదట నోటిఫికేషన్ ను నిలుపదల చేసిన పీయస్సీ ఇప్పుడు ఆ ప్రకటనను రద్దు చేసింది. త్వరలోనే సవరణ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.