తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌ జి దీప్తి గురువారం మృతిచెందారు . స్టేట్ ఆడిట్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దీప్తి పొరుగు సేవల్లో భాగంగా టిఎస్ఎండిసిలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆమె కిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు కోల్పోయారు.

ఆమె మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ కార్యాలయాల్లో ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించారు . దీప్తి మరణం పట్ల ఆడిట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు, జాయింట్ డైరెక్టర్స్ ద్రాక్షాయిణి, ఇందిరా , ఆడిట్ ఉద్యోగ సంఘం నాయకులు రవి ప్రసాద్, వెంకటేశం , రేవతి , కృపాకర్ , రామదాసులు సంతాపం తెలియజేశారు .

 

 

2007లో గ్రూప్ 1 ద్వారా ఆడిట్ అధికారిగా ఎంపికైన దీప్తి ప్రస్తుతం డిప్యూటి డైరెక్టర్ హోదా లో టీఎస్ఎండీసీలో జనరల్ మేనేజర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అడిషనల్‌ ఎస్పీగా బాధ్యతలు నెరవేరుస్తూ 1992లో ఐఎస్ఐ తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు విడిచిన జి.కృష్ణ ప్రసాద్ కుమార్తె దీప్తి.

ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వారి అమ్మకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాన్ని ఆఫర్ చేసినా "లో ప్రొఫైల్" జీవితం గడపాలనే ఉద్దేశ్యం తో సున్నితం గా తిరస్కరించారు. ఈ ఘటన జరిగినప్పుడు దీప్తి వయస్సు 13 ఏళ్లు.

 

 

చిన్న వయస్సు లోనే తండ్రిని కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో , పట్టుదలతో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ 2007లో గ్రూప్ 1 ఉద్యోగాన్ని సాధించారు దీప్తి. 2009-11 లో నేను మహబూబ్ నగర్ ఆర్‌టివోగా విధులు నిర్వర్తించారు. 45 రోజుల వ్యవధి లో తన అయిన వారందరినీ (పెద్దమ్మ,పెద్ద నాన్న, మేన మామ, అమ్మ) పొగొట్టుకున్న దీప్తి సైతం ఈ మహమ్మారికు బలవ్వడం అత్యంత బాధాకరం.