ఎస్సారెస్పి, సింగూరు తదితర ప్రాజెక్టులపై బోర్డు పెత్తనం తమ పరిధిలోకి తీసుకుంటామంటూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అమలైతే రాష్ట్రానికి తీరని అన్యాయం అభ్యంతరాలకు 29 వరకు గడువు
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని, రాష్ట్రంలోనే అతిముఖ్యమైన గోదావరి నదిపై గల ప్రాజెక్టుల పూర్తి అధికారాలను గోదావరి బోర్డు తీసుకోబోతుంది. ఇదే జరిగితే ఇక
గోదావరి నీటి వినియోగంపై రాష్ట్రానికి ఉన్న హక్కులు అన్ని హరించుకపోయే ప్రమాదం ఉంది.
రాష్ట్రంలోనే ప్రధాన నదిగా ఉన్న గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1200 టిఎంసి లకు మించి నీటిని వినియోగించుకోవచ్చు. బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు గతంలోనే నీటి వాటా నిర్ణయమైంది. దీనికి అనుగుణంగా తెలంగాణ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో గతంలోనే అనేక ప్రాజెక్టులను నిర్మించారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు గోదావరి నీటి పంపకాలపై వాదనలకు దిగాయి. దీంతో గోదావరి బోర్డు పంపకాలపై సుదీర్ఘ సమావేశాలు నిర్వహించింది. తాజాగా నీటి పంపకాలకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ లో తెలంగాణలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తమ అధీనంలోకి తీసుకరానున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా తెలంగాణ సూచించిన పట్టిసీమ, తాడిపూడి, పుష్కర, వెంకటాపురం ప్రాజెక్టుల అంశాన్ని కనీసం ప్రస్తావించనే లేదు.
ఇదే సమయంలో ఏపీ నుంచి కేవలం కేవలం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీని మాత్రమే తమ యాజమాయిషీ పరిధిలోకి తీసుకున్నట్లు ప్రకటించింది.
ఒక రాష్ట్రంలోని ప్రాజెక్టులను బోర్డు తన ఆధీనంలోకి తీసుకుంటే ఆ ప్రాజెక్టు కు సంబంధించి సంబంధిత రాష్ట్రం నీటి వినియోగ హక్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది.
బోర్డు విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఆరు ప్రాజెక్టులు, ఏపీలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ బోర్డు పరిధిలోకి వస్తాయి.
ఆయా ప్రాజెక్టుల బ్యారేజీ హెడ్‌వర్క్స్, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, కాల్వలు, రెగ్యులేటర్లతోపాటు విద్యుత్ పాంట్ల హెడ్ వర్క్ లు, రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, నీటిని విడుదల చేసే ఇతర నిర్మాణాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి.
గతంలో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందాల మరకు లేదా ట్రిట్యునల్ ఇచ్చిన అవార్డుల మేరకు ప్రాజెక్టులవారీగా చేసిన కేటాయింపులమేరకే మేజర్, మీడియం ప్రాజెక్టుల్లో నీటి వినియోగం చేయాలి.
ఇందుకు రాష్ట్ర విభజన సమయానికి ఉన్న నీటి కేటాయింపులనే పరిగణనలోకి తీసుకుంటారు. మైనర్ ఇరిగేషన్‌కు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. బోర్డు పరిధిలోకి రాకున్నా, రెండు రాష్ట్రాలతో సంబంధం ఉండే ఇతర ప్రాజెక్టులను సైతం బోర్డు స్వయంగా పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా, విద్యుదుత్పత్తిని నియంత్రించడంతోపాటు డ్యామ్, రిజర్వాయర్, రెగ్యులేటర్, కాల్వల నిర్వహణను చూస్తుంది. రిజర్వాయర్ల పరిధిలో చేపల పెంపకం అనుమతి లీజుల అంశాలన్ని పర్యవేక్షిస్తుంది. బోర్డు పేర్కొన్న లోయర్ మానేరు, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు నిర్మాణలో ఉండడంతో వాటి పురోగత నివేదికలను పర్యవేక్షణకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది.
ఇలా గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టలపై హక్కులు పూర్తిగా బోర్డుకు దఖలుపడుతాయి. ఇదే ఇప్పుడు తెలంగాణ కు సమస్యగా మారింది. అసలే గోదావరిపై ఇతర రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు కట్టి ఇబ్బందులకు గురిచేస్తుంటే ఇప్పుడు బోర్డు కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రాజెక్టులు తమ పరిధిలోకి తీసుకుంటూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం రాష్ట్రానికి పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు.
అయితే ముసాయిదా నోటిఫికేషన్ పై వాదనలు వినిపించేందుకు 29 వరకు గడువు ఇవ్వడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఈ లోపు తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులకు సంబంధించి తమ వాదనలకు పదును పెట్టి రాష్ట్ర హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
