జాయింట్ బలగాలతో మావోయిస్టుల కోసం జాయింట్ ఆపరేషన్:తెలంగాణ డీజీపీ
అంతరాష్ట్ర బలగాలతో మావోయిస్టుల కోసం జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. బుధవారంనాడు ములుగులో పలు జిల్లాల అధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు.
ములుగు:తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారంనాడు ములుగులో పర్యటించారు.భద్రాద్రి ,భూపాలపల్లి,మహబూబాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో డీజీపీ ములుగులో సమావేశమయ్యారు.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో పోలీసులు సరిహద్దు జిల్లాల్లో భద్రతను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి ఆరోగ్య సమస్యలతో చికిత్స కోసం వరంగల్ కు వచ్చిన మావోయిస్టులను పోలీసులు ఇటీవలనే అరెస్ట్ చేశారు. ఆరోగ్య సమస్యలు రావడంతో చికిత్స కోసం తెలంగాణకు వస్తున్నారని పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో పార్టీని విస్తరించాలని మావోయిస్టు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుందని పోలీసులకు సమాచారం అందింది. తెలంగాణలో పార్టీ విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకుగాను అగ్రనేతలు చత్తీస్ ఘడ్ ,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో సమావేశం నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. దీంతో ములుగులో డీజీపీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ ఉనికి లేకుండా పోయిందని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.ఛత్తీస్ ఘడ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో పార్టీకి పూర్వ వై భవం తెచ్చేందుకు రెండు మూడేళ్లుగా మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు.మావోయిస్టుల కదలికలు కన్పించగానే పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సరిహద్దు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో డీజీపీ ఇవాళ సమావేశమయ్యారు. సరిహద్దు జిల్లాలకు చెందిన అధికారులతో చర్చించారు.
లొంగిపోతే మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తాం: డీజీపీ
రాష్ట్రంలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. బుధవారంనాడు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష పూర్తైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
అంతరాష్ట్ర బలగాలతో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు.మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారిలో 60 ఏళ్లు పైబడినవారికి ఆరోగ్య సమస్యలున్నాయన్నారు. వారు లొంగిపోతే వారికి వైద్య చికిత్సఅందించనున్నట్టుగా చెప్పారు.లొంగిపోయే నక్సలైట్లకు పునరావాసం కల్పిస్తామని మహేందర్ రెడ్డి ప్రకటించారు.రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై నిఘాను ఏర్పాటు చేసినట్టుగా ఆయన చెప్పారు.