Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవ్‌.. : మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అభివృద్ధిని బీజేపీ, కాంగ్రెస్ లు అడ్డుకుంటున్నాయనీ,రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని, ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి కూడా లేదని మంత్రి హరీష్ రావు  ఎద్దేవా చేశారు. 

TS minister harish rao fires on congress and bjp KRJ
Author
First Published May 28, 2023, 10:51 PM IST

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే..ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ చెప్పేవన్నీ టీమ్ ఇండియా అయితే.. చేసేవి మాత్రం తోడో ఇండియా అంటూ సెటైర్లు వేశారు. తమకు నచ్చిన రాష్ట్రానికి మాత్రమే.. కేంద్రం నిధులు, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తోందని, ప్రశ్నించిన, ఎదురుతిరిగిన  రాష్ట్రాలకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 

అదే సమయంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరపడం  కాంగ్రెస్, బీజేపీలకు మింగుడుపడటం లేదని విరుచుకుపడ్డారు. నాడు ఉద్యమంలో రెండు పార్టీలు కలిసి రాలేదని, అందుకే నేడు ఉత్సవాలకు కూడా దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్సవాలు చేస్తామని కిషన్ రెడ్డి చెప్తున్నారని, ఆయన ఉద్యమ సమయంలో రాజీనామా చేయడానికి భయపడ్డారని ఎద్దేవా చేశారు.

అసలు తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందనీ ఉత్సవాలు చేస్తున్నారు? ఏం ఇవ్వలేదని ఉత్సవాలు చేస్తావా? అంటూ నిలదీశారు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకించడం అంటే.. అమరులను అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పెరు పెట్టుమంటే.. ఎందుకు పెట్టలేదని మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికైనా పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.

నీతి ఆయోగ్‌ సమావేశానికి రాలేదని కిషన్‌రెడ్డి నిలదీస్తున్నారనీ,, అసలు నీతి ఆయోగ్‌ను ఎవ్వరైనా లెక్క చేస్తున్నారా? నీతి ఆయోగ్‌ పరువు తీసింది  కేంద్రమేననీ, విలువ లేకుండా చేసింది కూడా కేంద్రమేనని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్‌కు రూ.25 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్, రాష్ట్రపతికి ముడిపెట్టి మాట్లాడుతున్నారని  అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ నామినేటెడ్ అయితే.. రాష్ట్రపతి ఎన్నికవుతారని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో.. ఏపీకి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వడంపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష కడుతోందని విమర్శించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, వారి హక్కులను కూడా రక్షించాలని సూచించారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు, వారికి వంతపాడే రాష్టాలకు ఒక తీరు.. తప్పులను ఎత్తిచూపితే.. మరో తీరుగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రానికి నిధులు మంజూరు చేయనప్పుడు ..నీతి ఆయోగ్ మీటింగ్ ఎందుకు రావాలని ప్రశ్నించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణను వెనక్కి లాగేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు తీవ్రంగా  ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ పని అయిపోయిందని.. ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios