104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించిన ఇస్రో నవ తెలంగాణ పునర్ నిర్మాణంలోనూ తన వంతు సహకారం అందిస్తోందన్న విషయం మీకు తెలుసా...
అందరూ అంటున్నట్లే ఈ రోజు దేశం మీసం మిలేసింది. ప్రపంచ చరిత్రలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తనకంటూ ఒక చరిత్ర సృష్టించింది. ఒక్కసారే 104 ఉపగ్రహాలను దిగ్విజయంగా అంతరిక్షంలోకి పంపి తమ ఖ్యాతిని విశ్వవ్యాప్తితం చేసింది.
ఈ సమయంలో తెలంగాణకు ఇస్రో అందిస్తున్న సేవలను కూడా ఒక సారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.
నవ తెలంగాణ నిర్మాణంలో ఇస్రో అందిస్తున్న సాంకేతిక సహాయ సహకారం నిజంగా మరవలేనిది.
రాష్ట్రంలోని జలవనరుల సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కొన్నాళ్ల కిందట ప్రభుత్వం ఇస్రో తో ఒప్పందం కుదుర్చుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఇస్రో అధ్యక్షుడు ఎ.ఎస్.కిరణ్ కుమార్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఇందుకోసం భువన్ అనే వెబ్ పోర్టెల్‌ను కూడా ఇస్రో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి హైదరాబాదులో ప్రధాన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు.
క్షేత్ర స్థాయిలో నీటి పారుదల నెట్‌వర్క్ గురించి సవివరమైన చిత్రాలను తీయడం. ఇందులో ఆనకట్టలు/బ్యారేజ్, చిన్న ఆనకట్టలు, ప్రధాన మరియు క్షేత్ర కాలువలను పరిశీలించి వివరాలను ప్రభుత్వానికి అందించడం ఇస్రో పని.
ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కు ఇస్రో అందించిన సాంకేతిక సహకారం ఎంతో ఉపయోగపడుతోంది.
ఎక్కడ నీటి నిలవులు ఎక్కువగా ఉన్నాయో గుర్తించడంలో, శిథిలమైన చెరువుల జాడను తెలపడంలో ఇస్రో సాంకేతిక సహకారం మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు బాగా ఉపయోగపడుతుంది.
అంతేకాదు తెలంగాణ విద్యార్థులకు కూడా ఇస్రో సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మన టీవీ పేరుతో పోటీ పరీక్షలకు టీవీ ద్వారా కోచింగ్ క్లాసులు అందించిన విషయం తెలిసిందే. దీనికి విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తుంది. గ్రూప్1, గ్రూప్ 2 , ఎంసెట్ తదితర పోటీ పరీక్షలకు నిపుణుల ద్వారా ఈ చానెల్ నుంచి క్లాసులు చెబుతున్నారు.
దీనికి ఇస్రో నే సహాయ పడుతోంది. ఈ మేరకు గతంలోనే ఐటీ మంత్రి కేటీఆర్ ఇస్రో తో ఒప్పందం కూడా చేసుకున్నారు. అంతేకాదు త్వరలో రాష్ట్రంలో 6 వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసేందుకు ఇస్రో సహకారం అందించనుంది.
ఇలా తెలంగాణ నవ నిర్మాణంలో ఇస్రో తన వంతు సహకారాన్ని కొనసాగిస్తూనే ఉంది.
