నంది అవార్డుల పేరు మార్పు సింహ పేరుతో సినిమా అవార్డులు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీరంగంపై త్వరలో సరికొత్త విధానాన్ని ప్రకటించనుంది. దీనికి సంబంధించి గత ఆరునెలలుగా చర్చించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

చిన్న సినిమాలను ఆదుకోవడం, నంది అవార్డుల పేరు మార్పు, చిత్రనిర్మాణాలకు వారంలోపే అనుమతి ఇవ్వడం, చిన్న సినిమాలకు కూడా ప్రదర్శనావకాశం కల్పించడం తదితర అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.


అలాగే, ఇకపై నంది అవార్డుల స్థానంలో సింహ పేరుతో అవార్డులు ఇవ్వనున్నారు. సినీ పరిశ్రమాభివృద్ధి కోసం నూతన విధానాలను అవలంబించాలని, ఈ మేరకు వచ్చే బడ్జెట్ అసెంబ్లీలో సమావేశాల్లోనే సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులతో చర్చిస్తున్నారు.తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధికి గతంలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.

ఈ కమిటీ సిఫారసులను కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

పరిశ్రమలకు అనుమతిచ్చే విషయంలో ఏర్పాటు చేసిన టిఎస్ ఐ పాస్ తరహాలో చిత్ర నిర్మాణాల అనుమతికి ఇతర విషయాలకు సింగిల్ విండో పద్ధతిని సినీ నిర్మాణాలకు వర్తింప చేసే విషయమైప్రభుత్వం చర్చిస్తోంది.

అలాగే, చిన్న సినిమాలను ఆదుకునేందుకు ప్రతి థియేటర్‌లో చిన్న బడ్జెట్ సినిమాను సాయం త్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యన ఒక షో ప్రదర్శించేలా నిబంధన పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. 

ఇకపై థియేటర్లకు రోజూ 5 షోల ప్రదర్శనకు అనుమతి ఇస్తారు. ఈ నెల 27న జరిగే సమావేశంలో ప్రతిపాదన ఖరారు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుది నివేదిక అందజేయాలని అధికారులు భావిస్తున్నారు.