TS EAMCET-2023: తెలంగాణలో ఫార్మసీ, మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష(ఎంసెట్)కు సర్వం సిద్దమైంది. ఈ పరీక్షను నిర్వహించేందుకు జేఎన్టీయూ హైదరాబాద్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే.. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు తప్పక పాటించాల్సిన రూల్స్ ...
TS EAMCET 2023: తెలంగాణలో ఫార్మసీ, మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష(EAMCET)కు సర్వం సిద్దమైంది. నేటీ నుంచి (మే 10) ప్రారంభమయ్యే పరీక్షలు మే 14 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించగా.. మే 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ నిర్వహణకు జేఎన్టీయూ హైదరాబాద్ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ ఏడాది ఎంసెట్ కు 3,20,587 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి దాదాపు 50 వేల కంటే ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 137 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటే.. తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో కంటే.. అదనంగా 28 కొత్త కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు (TS EAMCET Hall Ticket) కూడా విడుదల చేశారు. ఎంసెట్ అధికారక వెబ్ సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు తప్పని సరిగా పాటించాల్సిన నియమాలివే..
>> ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలని ఎంసెట్ కన్వీనర్ డీన్‌కుమార్, కో-కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
>> అంటే.. అభ్యర్థులు తమ ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్ కార్డును వెంట తీసుకెళ్లాలని సూచించారు. జిరాక్స్ లను ఎట్టిపరిస్థితిలో అనుమతించబోమని అధికారులు తెలిపారు.
>> అదే సమయంలో ఈ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రానికి గంటన్నర ముందే రావాలని సూచించారు.
>> పరీక్ష రాసే విద్యార్థుల బయో మెట్రిక్ చేయనున్నారు.దీంతో గోరింటాకు, ఇతర డిజైన్లు చేతులకు ఉంటే అధికారులు బయో మెట్రిక్ తీసుకునే సమయంలో ఇబ్బంది మారవచ్చని తెలిపారు.
>> విద్యార్థులు కాలుక్యులేటర్లు, మేథమెటికల్, లాగ్ టేబుల్స్, స్మార్ట్ ఫోన్లు, రిస్ట్ వాచ్ లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎగ్జామ్ హాల్ లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు తెలిపారు.
