నారాయణపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకుని రాష్ట్రాన్ని పాలించడం మానుకోవాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకోకుండా పగలంతా ఫాంహౌస్ లో కాలక్షేపం చేస్తూ రాత్రుల్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని... ఇలా కాకుండా ప్రజల్లో వుంటూ పగలు కూడా నిర్ణయాలు తీసుకోవాలని సంజయ్ సూచించారు. 

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల గురించి రైతులకు వివరించేందుకు ఆదివారం  నారాయణపేట జిల్లాకేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సభకు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించారు. ఈ క్రమంలోనే రైతులకు సీఎం కేసీఆర్ దొంగ ప్రేమను చూపిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

నిజంగానే కేసీఆర్ కు రైతులపై అంత ప్రేమే వుంటే డిల్లీలో మూడురోజులు మకాం వేసిన ఆయన ఒక్కసారయిన ఉద్యమం చేస్తున్న రైతులవద్దకు వెళ్లేవారని అన్నారు. కానీ కేవలం కేంద్ర మంత్రులను మాత్రమే కలిసి తిరిగిరావడాన్ని చూస్తే ఆయనకు రైతులపై ఎంత ప్రేమ వుందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో రైతుల కోసమంటూ బంధ్ కు సీఎం మద్దతిచ్చినా... ఆ బంధ్ లో కేవలం టీఆర్ఎస్ నాయకులు తప్ప రైతులెవ్వరూ పాల్గొనలేదని బండి సంజయ్ పేర్కొన్నారు.