జాతీయపార్టీపై టీఆర్ఎస్ఎల్పీ తీర్మానం: దసరా నాడే కోఆర్డినేటర్లను ప్రకటించనున్న కేసీఆర్
దసరా రోజున జాతీయపార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.ఈ మేరకు కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేయనుంది.
హైదరాబాద్:జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కసరత్తు దాదాపుగా పూర్తైంది. దసరా రోజునే టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంతో పాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో తీర్మానం చేయనున్నారు. దసరా రోజున ఉదయం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విస్తృత స్థాయి సమావేశంలోనే జాతీయ పార్టీ కోఆర్డినేటర్లను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. దసరా రోజున సీఎం కేసీఆర్ పలు పార్టీలకు చెందిన జాతీయ నేతలకు కూడా ఆహ్వానాలు పంపారని సమాచారం.
జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. జాతీయ పార్టీ జెండా, ఎజెండా రూపకల్పన విషయమై ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. దసరా రోజునే జాతీయ పార్టీకి చెందిన అంశంపై కేసీఆర్ ప్రకటన చేయాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జాతీయ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ను పార్టీ నేతలు కోరారు. టీఆర్ఎస్ జిల్లా శాఖలు కూడ ఈ మేరకు తీర్మానాలు చేశాయి. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తానని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. ఇటీవల నిజామాబాద్ లో నిర్వహించిన సభలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు.
also read:దసరా రోజున టీఆర్ఎస్ఎల్పీ భేటీ: జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటనకు చాన్స్
ఈ విషయమై కేసీఆర్ పలు ప్రాంతీయ పార్టీల నేతలు, బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. అంతేకాదు పలువురు రిటైర్డ్ అధికారులు, మేథావులు, రైతు సంఘాల నేతలతో కూడ కేసీఆర్ చర్చలు జరిపారు. రైతుల సంక్షేమం ఎజెండాగా జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన రైతు సంఘాల ప్రతినిధులు ప్రశంసించిన విషయం తెలిసిందే.
కొంత కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలతోనే దేశం తిరోగమన విధానంలోకి వెళ్తుందని కేసీఆర్ విమర్శలు గుప్పించారు.