హైదరాబాద్: ఉత్తమ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పార్టీ మారితే అమ్ముడుపోయినట్టుగా మాట్లాడడం సరైందికాదన్నారు. ఆరోపణలు చేసే సమయంలో ఒక్కసారి ఆలోచించుకోవాలని కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు సూచించారు.చంద్రబాబునాయుడు పార్టీ మారలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

సోమవారం నాడు ఆయన తెలంగాణ శాసనసభ పక్ష కార్యాలయంలో  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.తమ ప్రాంతాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు చెప్పారు.  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్‌పై విమర్శలను కేటీఆర్ ప్రస్తావించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చేవ లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శలను కేటీఆర్ ప్రస్తావించారు.   కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకొంటే ఎంతకు కొనుగోళ్లు చేశారని ప్రశ్నిస్తారా అని ఆయన అడిగారు. మరో వైపు ఎన్నికలకు ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎందుకు ఉత్తమ్ మాట్లాడలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

అంతకు ముందు టీఆర్ఎస్ గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్సీలు భూపతి రెడ్డి, యాదవరెడ్డిలు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరారని కేటీఆర్ గుర్తు చేశారు. అంతకుముందు టీడీపీ గుర్తుపై గెలిచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. వీరందరిని కాంగ్రెస్ పార్టీ ఎంతకు కొనుగోళ్లు చేసిందో చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొందన్నారు.

ఏపీలో  టీడీపీ 26 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకొన్న విషయం కాంగ్రెస్ నేతలకు గుర్తు లేదా  అని ఆయన ప్రశ్నించారు. 2005-06 సంవత్సరంలో టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోలేదా అని కేటీఆర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడ  అదే  పార్టీలోనే ఉన్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు కూడ టీడీపీ వ్యవస్థాపకుల్లో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి చంద్రబాబునాయుడు టీడీపీలో చేరారని కేటీఆర్ గుర్తుచేశారు.

మార్చి 12వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఐదు స్థానాలను గెలుచుకొనే బలం తమకు ఉందని కేటీఆర్ చెప్పారు. ద్వితీయ ప్రాధాన్యత ఓటు ద్వారా తాము ఐదుగురు ఎమ్మెల్సీలను కైవసం  చేసుకొంటామన్నారు.రాజకీయాల్లో పార్టీలు మారడం తప్పు కాదన్నారు. తమ  ప్రాంత అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీకి చెందిన  ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

ఆపరేషన్ ఆకర్ష్: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

ముగిసిన సీఎల్పీ భేటీ: గాంధీ విగ్రహాం ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్నా

సీఎల్పీ భేటీ నుండి అర్ధాంతరంగా వెళ్లిన కోమటిరెడ్డి: నాయకత్వంపై విసుర్లు