కార్యకర్తలు, నేతల సమిష్టి కృషితోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతమైందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

తెలంగాణ ఏర్పడిన ఐదేళ్ల కాలంలోనే కేసీఆర్ రాష్ట్రాన్ని దేశానికి మార్గదర్శిగా నిలబెట్టారని కేటీఆర్ కొనియాడారు. ఐదేళ్ల క్రితం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేశారని.. కానీ కేవలం ఏడాది కాలంలోనే అందరి సందేహాలను పటాపంచలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.

ఆరు దశాబ్ధాల కరెంట్ కష్టాలను కేసీఆర్ ఏడాదిలోనే పొగొట్టారని తెలిపారు. గణేశ్ నవరాత్రులు వచ్చాయంటే ఖచ్చితంగా రెండు, మూడు రోజులు కర్ఫ్యూ వుండేదని కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్ధితి లేదన్నారు.

కరెంట్, సాగు, తాగు నీటీ సమస్యలను తొలగించి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ అభివృద్ధి ప్రణాళికలను కాంగ్రెస్ నేతలు చూసి తట్టుకోలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ప్రాణహిత నదిలో బోటు షికారు చేసి.. కేసీఆర్‌పై విమర్శలు చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.  ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అపసోపాలు పడుతున్నారని సెటైర్లు వేశారు. 

ప్రజలు ఎన్నికలలో బుద్ది చెప్పినా కాంగ్రెస్ నేతలు మారటం లేదని... తెలంగాణ లో నే కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీ లలో చేరుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు టి ఆర్ ఎస్ పార్టీ పటిష్టం గా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలను సంతృప్తి పరిచి రుణం తీర్చుకుంటామని కేటీఆర్ తెలిపారు. 

తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు