తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం సోమవారం పరిశీలించింది.  ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లోకాగజ్‌నగర్ చేరుకున్న నేతలు అక్కడి నుంచి అసిఫాబాద్ జిల్లా కౌఠాల మండలం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణ స్థలాన్ని సందర్శించింది.

ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని.. కమీషన్ల కోసం ప్రాణహిత బ్యారేజీ ప్రాణం తీశారని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే.. తక్కువ ఖర్చుతో ప్రాణహిత జలాలు అందేవని..  ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. 

సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసివుంటే సాగు, తాగు నీటీ అవసరాలు తీరడమే కాకుండా 1.50 లక్షల కోట్లు ఆదా అయ్యేవని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణలోనే అత్యంత ఎత్తైన తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేసి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని సరఫరా చేసేందుకు వీలుగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిందని భట్టి గుర్తు చేశారు. 

ఈ బృందం లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, నేతలు విహెచ్, షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు.