హైదరాబాద్‌: ప్రముఖ వ్యాపార కేంద్రం బేగంబజార్ లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు వీరంగం సృష్టించారు. వ్యాపార కేంద్రాలను మూసివేయాలంటూ వ్యాపారులను బెదిరించారు. తమ మాట వినకుండా షాప్ మూయలేదని ఆగ్రహించిన నాయకురాలి అనుచరుల ఓ షాప్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బేగంబజార్ ప్రాంతానికి చెందిన శాంతిదేవి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే నిన్న(మంగళవారం) ఉగాది పండగరోజు రాత్రి 8గంటల సమయంలో అనుచరులతో కలిసి వచ్చిన ఆమె షాపులను మూసివేయాలంటూ వ్యాపారులను కోరారు. 

అయితే ఓ ప్లైవుడ్ షాప్ యజమాని ఆమె మాట వినకుండా షాప్ ను తెరిచివుంచాడు. దీంతో కోపోద్రిక్తులయిన శాంతిదేవి అనుచరులు సదరు వ్యాపారిని రోడ్డుపైనే చితకబాదారు. ఇలా దాడికి పాల్పడుతున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. 

శాంతిదేవి అనుచరుల దాడిలో గాయపడ్డ షాప్ ఓనర్ పోలీసులను ఆశ్రయించాడు. తనపై అకారణంగా దాడికి  పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పాటు సిసి కెమెరాలో రికార్డయిన దాడి వీడియోను పోలీసులకు అందించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న బేగంబజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.