మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో నిర్మల్ మున్సిప‌ల్ వైస్ చైర్మన్‌ షేక్ సాజిద్‌‌పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ నాయకత్వం సాజిద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో నిర్మల్ మున్సిప‌ల్ వైస్ చైర్మన్‌ షేక్ సాజిద్‌‌పై ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన షేక్ సాజిద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ పార్టీ సాజిద్‌పై చర్యలకు ఉపక్రమించింది. ‌సాజిద్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నషేక్ సాజిద్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. 

సోమ‌వారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సాజిద్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వాన్ని ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు. సాజిద్‌పై సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. బాలిక‌పై లైంగిక దాడి చేసిన‌ట్లు సాజిద్‌పై ఫిర్యాదు చేసిన వెంట‌నే పోలీసులు పోక్సోచ‌ట్టం కింద‌ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టార‌న్నారు. బాధితురాలికి న్యాయం జ‌రిగేలా చూస్తామని తెలిపారు. 

ఇక, సాజిద్‌పై మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి కథనం ప్రకారం…నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేటకు చెందిన టిఆర్ఎస్ నేత షేక్ సాజిద్ స్థానిక వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికై… చిన్నవయసులోనే వైస్ చైర్మన్ పదవిని చేపట్టాడు. ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరైన sajid…అక్కడ ఓ 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. అంతే ఆ బాలికను శారీరకంగా లొంగదీసుకునేందుకు అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దింపాడు. 
అన్నపూర్ణమ్మ ఆ బాలికను నమ్మించి నిజామాబాద్ వరకు వెళ్లాలి తోడు రమ్మంటూ వెంటబెట్టుకుని వెళ్ళింది. ఆ తర్వాత ‘హైదరాబాదులో ఓ దావత్ ఉంది అక్కడికి వెళుతున్నా.. ఇక్కడిలా కాదు.. అక్కడ గ్రాండ్ గా ఉంటుంది ఫంక్షన్.. నువ్వు కూడా రావచ్చు కదా?’ అంటూ ఆఫర్ ఇచ్చింది. సాయంత్రానికి తిరిగి వచ్చేయొచ్చని.. కారులోనే వెళ్దామని చెప్పింది. దీంతో తెలిసిన మహిళా కదా అని ఆ బాలిక సరే అని చెప్పింది. ఆ తర్వాత ఆ మహిళ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. కాసేపటికి ఒక కారు వచ్చింది. డ్రైవర్, అన్నపూర్ణతో కలిసి ఆ బాలిక కారులో బయలుదేరింది. చార్మినార్ సమీపంలోని ఓ లాడ్జిలో అప్పటికే బస చేసిన వైస్ చైర్మన్ షేక్ సాజిద్ కు ఆ బాలికను అప్పగించింది.

అతను ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను బెదిరించి, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశాడు. భయం భయంగా ఇంటికి వచ్చిన బాలికను... విషయం ఏంటని తల్లి ప్రశ్నించడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దాంతో ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాజిద్ పై పోక్సో, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. sajidకు సహకరించిన అన్నపూర్ణమ్మ, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చిన కారు డ్రైవర్లను నిందితులుగా చేర్చారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని డిఎస్పీ వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు గళమెత్తాయి. ఘటనతో అధికార టీఆర్ఎస్ లో తీవ్ర కలకలం రేగుతోంది.