మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ వ్యవహరించిన తీరు అంతుచిక్కడం లేదు. కొన్నిచోట్ల రెబల్స‌ను దగ్గరికి తీసుకుంటూ మరికొన్ని చోట్ల అవసరం లేదని స్పష్టం చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది.

పార్టీ ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా వ్యవహరించింది. కొన్ని నియోజకవర్గాల్లో రెబెల్స్ మద్దతుతో పదవులు దక్కించుకున్నారు. అదే సమయంలో వీరు అధికార పార్టీ అభ్యర్థులతో పోటీ పడి విజయం సాధించారు. ఆ నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించకుండా అడ్డుకోగలిగారు.

Also Read:బిజెపికి కాంగ్రెస్ షాక్: మేయర్ పదవిని దక్కించుకున్న టీఆర్ఎస్

ఎన్నికల అనంతరం టీఆర్ఎస్‌కు మద్దతిస్తామని కొంతమంది రెబెల్స్ ముందుకు కూడా వచ్చారు. అయినా పార్టీ పట్టించుకోలేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం మద్దతు ఇవ్వాలని కోరడంతో టిఆర్ఎస్‌కు రెబెల్స్ అండగా నిలిచారు.

దీంతో అధికార పార్టీ వైఖరి ఏమిటని నేతలకు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫార్వర్డ్ బ్లాక్ తరపున రెండు మున్సిపాల్టీల్లో తన అనుచరులను రంగంలోకి దింపి కొల్లాపూర్, ఐజలలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నారు.

అయితే ఛైర్మెన్ ఎన్నికల్లో పార్టీకి మద్దతు ఇస్తామన్న సంకేతాలు ఇచ్చారు. ఆయినాఎక్స్ అఫిషియో ఓట్లతో టిఆర్ఎస్ కొల్లాపూర్ మున్సిపాలిటీని చేజిక్కించుకుంది. ఐజలో రెబెల్స్‌గా తాము బరిలో దిగినా చైర్మన్ ఎన్నికకు పార్టీ నిర్ణయం ఫైనల్ అంటూ పార్టీకి సరెండర్ అయ్యారు. ఎమ్మెల్యేకు తమ బలం తెలియజేసేందుకు రెబల్స్ బరిలో నిలవాల్సి వచ్చింది అని చెప్పి వారంతా టీఆర్ఎస్ చేరారు. 

రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున గెలిచిన అభ్యర్థులు ఫలితాలు రాకముందే టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు. దీంతో అక్కడా రెబల్స్ మద్దతుతో టిఆర్ఎస్ సునాయసంగా మేయర్ స్థానం కైవసం చేసుకుంది.

Also Read:మల్లారెడ్డి కార్మిక మంత్రిగా ఉండడం మన కర్మ: నాయిని సంచలనం

తాజాగా ఇప్పుడు రెబెల్స్, స్వతంత్రుల విషయంలో పార్టీ ఎలా స్పందిస్తుందో అంతు చిక్కడం లేదని నేతల్లో చర్చ మొదలైంది. రెబల్‌గా పోటీ చేసిన నేతలు కొంతమంది ప్రజాక్షేత్రంలో బలం నిరూపించుకున్నా.. ఎక్కడా సరైన గుర్తింపు దక్కించుకోలేక పోయారు.

మరో నాలుగేళ్లు రెబల్స్‌గా ఉన్న నేతలకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  పార్టీకి చేరువైన నేతలు మాత్రం తాము అనుకున్నది సాధించామని సంబరపడిపోతుంటే పార్టీ దూరంగా ఉంచిన నేతలు మాత్రం తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది అని వాపోతున్నారు.