నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వ్యూహాత్మకంగా వ్యవహరించి నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకుంది. నిజామాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో బిజెపి అత్యధిక డివిజన్లను గెలుచుకుని తొలి స్థానంలో నిలువగా, మజ్లీస్ రెండో స్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ మూడో స్థానం పొందింది.

బిజెపి 28 కార్పోరేటర్లను గెలుచుకుంది. అయితే, మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులకు పోటీ చేసింది. అయితే, మెజారిటీ దక్కకపోవడంతో ప్రతిపక్షానికి పరిమితమైంది. నిజామాబాద్ లో మొత్తం 60 స్థానాలున్నాయి. 

Also Read: నేరేడుచర్ల వివాదం: ఉత్తమ్, కేవీపీల అరెస్ట్, మిర్యాలగుడాకు తరలింపు

మజ్లీస్ 16 స్థానాలను గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. దీంతో మజ్లీస్ టీఆర్ఎస్ అభ్యర్థిని బలపరిచింది. తద్వారా టీఆర్ఎస్ మేయర్ పదవిని దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకు ఇచ్చింది. టీఆర్ఎస్ కేవలం 13 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. టీఆర్ఎస్ కు చెందిన దండు నీతు కిరణ్ మేయర్ గా ఎన్నికయ్యారు. 

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉన్న అవగాహన కారణంగా మేయర్ పదవిని టీఆర్ఎస్ మజ్లీస్ కు ఇస్తుందని బిజెపి భావించింది. నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ టీఆర్ఎస్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మధ్య మాటల యుద్ధం నడిచింది. మేయర్ పదవిని మజ్లీస్ ఇవ్వబోమని దేవుళ్లపై గుప్తా ప్రమాణం చేశారు. 

Also Read: ఉత్తమ్‌కు షాక్: టీఆర్ఎస్ వశమైన నేరేడుచర్ల మున్సిపాలిటీ

మజ్లీస్ కు చెందిన మొహమ్మద్ ఇద్రిస్ ఖాన్ డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ కు ఓ ఇండిపెండెంట్, ఇద్దరు కాంగ్రెసు కార్పోరేటర్లు, ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటేశారు. తమది సెక్యులర్ పార్టీ కాబట్టి కాంగ్రె,సు, ఇండిపెండెంట్ సభ్యులు తమకు ఓటేశారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.