మెదక్: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను బరిలోకి దింపే అవకాశం ఉంది. గత మాసంలో సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.ఉప ఎన్నికల నోటిఫికేష్ వచ్చే నాటికి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

also read:కేసీఆర్, చాడ వెంకట్ రెడ్డి భేటీ వెనుక అంతర్యం ఇదేనా?

ఈ మేరకు టీఆర్ఎస్ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మండలాలకు ఇంఛార్జీలను నియమించనున్నారు. సోలిపేట రామలింగారెడ్డి తనయుడు సతీష్ రెడ్డిని బరిలోకి దించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావించింది. అయితే సతీష్ రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. మరో వైపు కొందరు నేతల మాటలను విని రామలింగారెడ్డి  తమను పక్కన పెట్టారని అసమ్మతి నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంలోనే ఈ దఫా కూడ టిక్కెట్టు ఇస్తే తమకు న్యాయం జరగదని నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయమై తమ వాదనను విన్సిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి ముత్యం రెడ్డి తనయుడు కూడ టిక్కెట్టు రేసులో ఉన్నాడు. అయితే ఈ దఫా సోలిపేట రామలింగారెడ్డి కుటుంబసభ్యులకే టిక్కెట్టు ఇస్తామనే సంకేతాలను టీఆర్ఎస్ నాయకత్వం ఇచ్చింది.

ముత్యం రెడ్డి తనయుడికి ఎమ్మెల్సీ  ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. మరో వైపు సతీష్ రెడ్డికి కాకుండా సోలిపేట రామలింగారెడ్డి భార్యకు ఈ దఫా టిక్కెట్టు ఇచ్చేందుకు  టీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితిని బట్టి టిక్కెట్టు విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందంటున్నారు. 

దుబ్బాక నియోజకవర్గంలో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఉప ఎన్నికల్లో అసమ్మతి నేతల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది.