Round-up 2021 | లక్షల మందిని బలిగొన్న మహా విషాదం.. కోట్లాది మంది కన్నిటి సాక్ష్యం.. కరోనా సెకండ్ వేవ్

Round-up 2021 : లక్షల మందిని బలిగొన్న మహా విషాదం.. కోట్లాది మంది కన్నిటి సాక్ష్యం.. కరోనా సెకండ్ వేవ్... క‌రోనా వైర‌స్ పంజా విస‌ర‌డంతో నిత్యం ల‌క్ష‌ల్లో కేసులు.. వేలల్లో మ‌ర‌ణాలు. ఆస్ప‌త్రుల్లో బెడ్స్ నిండిపోయి.. వైద్యం కోసం ఆస్ప‌త్రుల ముందు రోగుల ప‌డిగాపులు.. ఆక్సిజ‌న్ కొర‌త‌తో రోగులు చ‌నిపోయ‌న దృశ్యాలు సెకండ్ వేవ్ లో క‌నిపించాయి. శ్మ‌శానాలు మృతుల‌తో నిండిపోవ‌డం, గంగా నదిలో శ‌వాలు కొట్టుకురావ‌డం.. యూపీ బీహార్ లోని గంగాన‌ది ఇసుక దిబ్బ‌ల్లో వ‌ర్షానికి శ‌వాలు బ‌య‌ట‌ప‌డ‌టం క‌రోనా పంజాకు నిద‌ర్శ‌నం.. 
 

Round up 2021: corona second wave

Round-up 2021 : కరోనా వైరస్.. భారత్ లో సృష్టించిన‌ సంక్షోభం అంతాఇంతా కాదు.  లక్షల మందిని బలిగొన్న మహా విషాదం.. కొట్లాది మంది కన్నిటి సాక్ష్యం.. కరోనా సెకండ్ వేవ్.   కరోనా ఉధృతి ధాటికి దేశ ఆరోగ్య వ్యవస్థ సైతం చేతులెత్తేసింది. నిత్యం లక్షల్లో కరోనా బారిన పడ్డారు. వేల మందని బలితీసుకుంది. ఆస్పత్రుల్లో పడకలు నిండిపోయాయి. బెడ్స్ లేక వేల మంది ఆస్పత్రుల ముందే ప్రాణాలు  వదిలారు.  ఆస్పత్రిలో చేరిన వారికి సైతం వైద్యం అందని పరిస్థితులు ఏర్పడి వేలాది మంది ఆక్సిజ‌న్ అందక చనిపోయారు. ఆక్సిజన్ కోసం ఆస్పత్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించాయంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, 2004లో భారత్‌ విదేశీ సహాయం తీసుకోవడం నిలిపి వేయగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాన్ని పునరుద్ధరించటం అప్పటి దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. అసలు దేశంలో సెకండ్ వేక్ కారణాలేంటి? కోట్ల మందిని అనారోగ్యానికి గురిచేస్తూ.. లక్షల మందిని బలితీసుకోవడం వెనుక అసలు విషయాలేంటి? కరోనా మొదటివేవ్ తర్వాత భారత్ సెకండ్ వేవ్ పై ఎందుకు దృష్టి పెట్టలేకపోయింది? వ్యాక్సిన్లు మన దగ్గరే తయారవుతున్న ఎందుకు ఇవ్వలేదు? భారత ఆర్థిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం.. ప్రజలను ఎలా దెబ్బకొట్టింది? 

2019లోనే కరోనా వైరస్ ను చైనాలో గుర్తించినట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, భారత్ లో  మొట్టమొదటి కరోనా కేసు 2020 జనవరి 30న గుర్తించబడింది. ఈ వ్యాధి క్రమంగా పెరుగుతూ మే 21 నాటికి రోజుకి 8105 మందికి సోకింది. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతూ సెప్టెంబర్‌ 16 నాటికి రోజుకు 97,894 మందికి సోకే దశకు చేరింది. దీనిని కరోనా మొదటి దశగా పేర్కొన్నారు. కరోనా వైరస్ విజృభ‌ణ నేపథ్యలో ప్రభుత్వ అకస్మాత్తు లాక్ డౌన్ ప్రకటన కోట్లాది మందనిని బాధించింది. ముఖ్యంగా వలస కార్మికుల కన్నిటీ గాధలు ఇప్పటికీ మన కండ్ల  ముందు కదలాడుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి తిండిలేక,  తాగడానికి నీరు లేక దాదాపు 700 మందికి పైగా వలస జీవులు ఆకలి మంటలతో మరణించారు. ఉపాధి కోల్పోయిన వారి లెక్కలు కోట్లల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న కరోనా కట్టడి చర్యలు, లాక్ డౌన్ కారణంగా కరోనా రోజువారి కేసులు తగ్గుముఖం పట్టాయి.   ఆ రోజు నుంచి రోజు వారీ సంఖ్య తగ్గుతూ ఫిబ్రవరి 1 నాటికి 8,635 మందికి సోకింది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం కరోనా వైరస్ ను తేలిగ్గా తీసుకుంది. 

కరోనా సెకండ్ వేవ్.. నిత్యం లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు 

కరోనా మొదటివేవ్ దశ ఫిబ్రవరి 1 నాటికి తగ్గుముఖం పట్టడంతో అధికార యంత్రాంగం కరోనా వైరస్ ను తేలికగా తీసుకుంది. ఇదే సమయంలో కరోనా వైరస్  ప్రపంచ దేశాల్లో పంజా విసురుతున్నది. అప్పుడప్పుడే వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, మార్చి ద్వితీయార్ధం నుంచి దేశంలో కోవిడ్‌ వ్యాప్తిలో పెరుగుదల మొదలైంది. ఏప్రిల్ 30నాటికి ఇది రికార్డు స్థాయికి చేరుకుంది. ఒకే రోజు 4 లక్షల కేసులు నమోదయ్యాయి. కోవిడ్ పీక్ స్టేజీకి చేరడంతో నిత్యం 4 లక్షలకు పైగా కొత్త కేసులు, వేలల్లో మరణాలు సంభవించాయి. ఈ ఏడాది మేలో దీని ప్రభావం మరింత తీవ్రంగా కొనసాగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు అంటే మే 3 నాటికి వాటి సంఖ్య 3,60,000కు పడిపోయింది. దీంతో ఇండియాలో కోవిడ్ పీక్‌స్టేజ్ దాటిందని అంచనా వేశారు.  కానీ, ఆ తర్వాత మళ్లీ కేసులు వేగంగా పెరగడం మొదలు పెట్టింది.  మే 5న అత్యధికంగా 4.12 లక్షల కేసులు నమోదయ్యాయి.  అలాగే, అదే రోజు ఏకంగా 3,971 మంది కరోనాతో మరణించారు. అధికారిక లెక్కల ప్రకారం మార్చి చివరి వరకు మన దేశంలో 1 లక్ష 62 వేల మంది కరోనా కారణంగా చనిపోయారు. ఆ తర్వాత రెండు నెలల్లోనే మరణాల సంఖ్య రెట్టింపయ్యింది. సెకండ్ వేవ్ కారణంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 3.35 లక్షలు దాటింది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం.. ఆక్సిజన్ కొరత కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఆస్పత్రుల ముందే పిట్టల్లా రాలిన జనం.. ఆక్సిజన్ కొరత 

కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజీ తక్కువ కాలమే కొనసాగినప్పటికీ.. దాని ప్రభావం ఊహకందని స్థాయిలో కొనసాగింది. ఒక్కసారిగి రికార్డు స్థాయిలో లక్షల్లో కొత్త కేసులు పెరుగుతుండటం, మరణాలు సైతం వేల్లలో చోటుచేసుకోవడంతో కరోనా భయాలు మరింతగా ముదిరాయి. ఆస్ప్రత్రులు రోగులతో నిండిపోయాయి. రోగులకు తగినంతగా వెంటిలేటర్లు లేవు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధించింది. దీంతో ఆస్పత్రుల లోపల.. బయట కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రాణాలు వదిలిన ఘటనలు అనేకం. ఆక్సిజన్, కొరత కారణంగా మీరట్, లక్నో ఆస్పత్రుల్లో రోగులు చనిపోవడంపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రాలోని ఓ ఆస్పత్రిలో రోగులకు ఆక్సిజన్ అందక 16 మంది చనిపోయారు. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రోగుల బంధువులు ఆందోళన కూడా చేశారు.  మే మొదటివారంలోనే కర్నాటకలోని చామరాజనగర్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి రుయా ఆస్పత్రిలో మే 10 ఆక్సిజన్ కొరత కారణంగా 11 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. మొత్తంగా  ఆక్సిజన్ కొరత కారణంగా రుయా ఆస్పత్రిలో 23 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. విజయనగరంలోని మహారాజ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఐదుగురికి పైగా మరణించారు.  ముంబయిలోని ఒక ఆస్పత్రిలో ఒకే రోజు ఏడుగురు చనిపోవడానికి కూడా ఆక్సిజన్ కొరతే కారణమని ఆరోపణలున్నాయి. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత మరణాలు సంభవించాయి. 

 

 సెకండ్ వేవ్ ప్రారంభంలో 12 రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. వీటిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. కరోనా పీక్ స్టేజ్ కు చేరిన తర్వాత అన్ని ప్రాంతాల్లోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడింది.  ఆక్సిజన్ సరఫరా కేటాయింపులు పెంచాలంటూ ఢిల్లీ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇందులో ఆస్పత్రులు కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ కొరతను తీర్చడానికి పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాపై ఆంక్షలు విధించింది. ఆక్సిజన్ రైళ్లను సైతం ప్రారంభించింది. విదేశీ సాయాన్ని సైతం కోరింది. అనేక జర్మనీ, అమెరికా, కేనడా వంటి దేశాలు సాయం అందించాయి. 

ఆరోగ్య సిబ్బంది మరణాలు అధికమే.. 

కరనా సెకండ్ వేవ్ లో ముందుండి వైరస్ వ్యతిరేకంగా పోరాటం సాగించిన వారిలో పారిశుధ్య కార్మికులు, పోలీసులు, ఆరోగ్య సబ్బంది పాత్ర గణనీయమైనది. అయితే, వీరిలో  కరోనా బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్ప్రత్రుల్లో వైద్యం అందిస్తూనే డాక్టర్లు కుప్పకూలిన ఘటనలు కన్నీరు పెట్టించాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూన్ నెల నాటికి 776 మంది వైద్యులు కోవిడ్ కారణంగా మరణించారని భారత వైద్య మండలి(ఐఎంఏ) గణాంకాలు వెల్లడించాయి. కరోనా ప్రారంభం నుంచి జూన్ వరకు మొత్తం 1500 మందికి పైగా వైద్యులు చనిపోయారు. వీరిలో అధికం ఢిల్లీ, యూపీ, బెంగాల్, రాజస్థాన్, జార్ఖండ్, ఏపీలకు చెందినవారు ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య రెట్టింపు కంటే అధికంగా ఉందని గణాంకాలు పేర్కొంటున్నాయి. సెంట్రల్ పోలీసు ఫోర్సెస్ లో 300 మందికి పైగా కరోనాతో చనిపోయారు. అన్ని విభాగాల్లో కలిపి వేలల్లో మరణాలు సంభవించాయి. పారిశుధ్య కార్మికుల మరణాలు సైతం అధికంగా నమోదయ్యాయి.

దారుణంగా మారిన ప్రజల ఆర్థిక పరిస్థితులు...

క‌రోనా మహమ్మారి కారణంగా అనేక మంది తమ ఉపాధిని కోల్పోయారు. ఆర్థికపరంగానే కాకుండా కుటుంబ సమస్యలతోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు సరైన ఉపాధి దొరక్క ఇంటికే పరిమితం కాగా… మరికొన్ని రంగాల్లో ఇంట్లో నుంచే పనిచేస్తూ జీవితాన్ని గడిపేశారు. సెకండ్ వేవ్ లో ప్రభుత్వ ఆంక్షలు, కరోనా భయాల నేపథ్యంలో అనేక రంగాల్లో పరిశ్రమలు మూత పడ్డాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి లేక చేతుల్లో చిల్లిగవ్వలు లేక కుటుంబ పోషణ భారమైన పరిస్థితులెన్నో వెలుగుచూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైన భారంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2021లో కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనూ ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. 

కరోనా సెకండ్ వేవ్ పంజా కారణంగా  97శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయిందని  సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ వ్యాస్ వెల్లడించారు. ఏప్రిల్‌లో 8శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మే నెలలో 12శాతానికి పెరిగింది. దాదాపు కోటి మంది ఉపాధికి దూరమయ్యారు. ఒక్క ఏప్రిల్‌లోనే 70.35 లక్షల మంది ఉద్యోగాలు ఊడాయి. దేశంలోని కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆర్థిక వ్యవస్థకు 2 కోట్ల లక్షల నష్టం వాటిళ్లిందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ భారతంలోనూ నిరుద్యోగం పెరిగింది. దాదాపు 10 కోట్ల మందికి పైగా అత్యంత పేదరికంలోకి జారుకున్నారని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. పేదలు, ధనికుల మధ్య అసమానతలు సైతం భారీగా పెరిగాయి.  మొత్తంగా భయానక కొవిడ్ వైరస్ దాటికి భిన్న రంగాలు చిన్నాభిన్నమై కూనరిల్లాయి. వివిధ వృత్తి ఉద్యోగ వ్యాపారాలూ చతికిలపడి అసంఖ్యాక కుటుంబాలు తీవ్ర‌ దురవస్థల పాలయ్యాయి. ఆ ప్రభావ పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 

కరోనా రెండో‌ వేవ్‌లో పెరిగిన గృహహింస కేసులు

సెకండ్ వేవ్ సమయంలో గృహ హింస కేసులు అధికంగా నమోదయ్యాయని రాజ్యసభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. 2021 ఏడాదిలో ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల మధ్యలో 3,582 గృహ హింస కేసులు నమోదైనట్టు తెలిపారు. క‌రోనా సెకండ్ వేవ్‌లో 3,582 గృహ హింస కేసులు న‌మోదు అయ్యాయని, 2020 ఏడాదిలో 3,748 గృహ హింస కేసులు న‌మోదైన‌ట్లు వివరణ ఇచ్చారు. మానసిక రుగ్మతలు సైతం అధికమయ్యాయి. మహిళలతో పాటు ఇండ్లలో వృద్దులపైనా వేధింపులు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం వారి ఆర్థిక పరిస్థితులు కూడా ఒకటని పలు నివేదికలు పేర్కొన్నాయి. 

ప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ.. సర్కారు నిర్లక్ష్యంపై విమర్శలు

కోవిడ్-19 ప్రభావిత రంగాలకు రూ .11.1 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ పథకం అందుబాటులో తిసువచ్చినట్లు, ఇందులో రూ .50 వేల కోట్లు ఆరోగ్య రంగానికి కేటాయించినట్టు జూన్ 28న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆస్పత్రుల్లో పీడియాట్రిక్, పీడియాట్రిక్ బెడ్స్ కోసం రూ .23,220 కోట్లు అందిస్తామన్నారు.  అత్యవసర క్రెడిట్ ఫెసిలిటీ గ్యారెంటీ పథకాన్ని విస్తరిస్తున్నామని, ఈ పథకం కింద ఎంఎస్‌ఎంఇలకు (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్), ఇతర రంగాలకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు అందుబాటులో ఉంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు.  అయితే, దీని వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని ఆరోపణలు ఉన్నాయి.  ఈ సంక్షోభ స‌మ‌యంలో రేష‌న్ ఉచితంగా అందించ‌డంతో కోట్లాది మంది ఆక‌లి తీరింది. దీని కింద‌కు రానివారు ఆక‌లి మంట‌ల‌తో అల‌మ‌టించార‌ని రిపోర్టు పేర్కొన్నాయి. క‌రోనా  మొదటి వేవ్ తర్వాత వైరస్ భవిష్యత్తులో  పంజా విసిరితే ఏం చేయాలనే విషయంలో ముందుజాగ్రత్తగా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. వివిధ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమై పంజా విసురుతుంటే భారత్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని మోడీ పేరుప్రతిష్ఠలను దారుణంగా దిగజార్చింది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ విరుచుకుపడడానికి మోడీనే కారణమంటూ ఇటీవల గ్లోబల్ మీడియా కూడా దుమ్మెత్తి పోసింది. ఆయన ప్రతిష్ఠ కరోనా దెబ్బకు అమాంతం మసకబారింది. భారత్ కరోనాను జయించిందని జనవరిలో దావోస్‌లో మోడీ పేర్కొన్న మాటలను కొందరు ఈ సమయంలో గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే  ఈ దారుణానికి కారణం అని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం కూడా ప్రభావాన్ని మరింతగా పెంచింది. 

ప్రజల దీన చూపులు..

కరోనా మహమ్మారి కల్లోలం కారణంగా నిత్యం వేల‌ల్లో మొదలై లక్షల్లోకి కరోనా కేసులు పెరిగాయి. మరణాలు కూడా అధికమయ్యాయి. ఒకానొక సమయంలో శ్మశానాల్లో కరోనా రోగులను దహనం చేయడానికి ప్లేస్ లేకుండా పోవడంతో కొత్తగా ఏర్పాటు చేశారు.  ప్రజలతో కిక్కిరిసిన శ్మశానాల్లో కోవిడ్ మృతుల అంత్యక్రియలు జ‌రిగాయి.  ఆస్పత్రుల బయట మృతదేహాల కోసం ఎదురుచూసే కుటుంబాలు, శ్వాస అందని రోగులతో ఆస్పత్రుల బయట నిలిచిన అంబులెన్సులు, శవాలతో నిండిన మార్చురీల వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ దృశ్యాలు కండ్ల ముందే కదలాడుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లోని కారిడార్లలో, వరండాల్లో ఒకే బెడ్ మీద ఇద్దరు రోగులు ఉండడం అనేక ఆస్పత్రుల్లో కనబడింది. మందుల కోసం వేచివున్న పరిస్థితులు ఉన్నాయి. లెక్కలోకి రాని మరణాలు అనేకం ఉన్నాయి. దీనికి సాక్షంగా ఉత్తరప్రదేశ్, బీహార్ లలో గంగానదిలో శవాలు కొట్టుకురావడంతో పాటు అక్కడి ఇసుక దిబ్బల్లో పూడ్చిన మృత దేహాలు వర్షం కారణంగా బయట పడటం ఉదాహారణలుగా ఉన్నాయి.  ఇందంతా ఒక కోణం అయితే.. ఉపాధి కోల్పోయి తినడానికి తిండిలేఖ లక్షలాది మంది రోడ్డున పడ్డారు. బెక్కెడు బువ్వ కోసం వందల మంది వరుసగా నిలబడి సాయం కోరిన కన్నీటి దఈశ్యాలు అనేకం. 

భారత్‌ థర్డ్‌వేవ్‌కు సిద్ధంగా ఉందా..?

కరోనా మొదటివేవ్ తో గుణపాఠం నేర్చుకోకపోవడంతో భారత్ ను రెండో వేవ్ కాటు వేసిందనేది అక్షర సత్యం.  దేశంలో కరోనా ప్రభావం పెరుగుతుంటే తాము కరోనాను జయించామని పేర్కొటూ జబ్బలు చర్చుకోవడంతో అతిపెద్ద సంక్షోభం వచ్చింది.  దీనికి ప్రధాన కారణంగా కొత్త వేరియంట్లతో పాటు డెల్టానే కారణమనీ, అతి తీవ్రంగా వ్యాపించడంతోనే పరిస్థితి దారుణంగా మారిందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే, ప్రస్తుతం పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కొత్త వేవ్ లను ఎదుర్కొంటున్నాయి. మరీ దాని నుంచి తప్పించుకునే విధంగా భారత్ సిద్ధంగా ఉందా? కరోనా మొదటి, సెకండ్ వేవ్ లతో భారత్ గుణపాఠం నేర్చుకుందా? ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి సిద్ధం చేశారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో డెల్టా వేరియంట్‌ వ్యాప్తి చెందినప్పుడు కరోనా నిర్థారణకై నిర్వహించే ర్యాపిడ్‌ టెస్టులు, ఆర్‌పీసీఆర్‌ టెస్టుల్లో పాజిటివ్‌ ను నెగిటివ్‌గా, నెగిటివ్‌ను పాజిటివ్‌గా ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ డెల్టా వేరియంట్‌ కంటే ఎక్కవ శక్తివంతంగా ఉన్న క్రమంలో ఇలా అరకోరగా టెస్టులు చేసి ఒమిక్రాన్‌ వ్యాప్తికి కారణం అవుతారనే భయం కూడా ప్రజల్లో లేకపోలేదు. కాబట్టి గత పరిస్థితులను గుర్తుంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు విపత్కర పరిస్థితులు ఏర్పడితే తట్టుకునే విధంగా వైద్య మౌలిక సదుపాయాలు ఇప్పుడే ఏర్పాటు చేసుకోవాలని విశ్లేషకులు, నిపుణులు చెబుతున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios