చంద్రబాబుకు కౌంటర్: ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్

TRS party in Andhra Pradesh
Highlights

తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనదైన పద్దతిలో కౌంటర్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు.

హైదరాబాద్‌: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటి రామారావు తనదైన పద్దతిలో కౌంటర్ ఇచ్చినట్లే కనిపిస్తున్నారు. తెలంగాణలో కూడా కర్ణాటక పరిస్థితే వస్తుందని, టీడీపి కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు అన్న విషయం తెలిసిందే. దానికి కౌంటర్ అన్నట్లుగా కెటిఆర్ శనివారంనాడు మాట్లాడారు.

తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని గతంలో ఆంధ్రా నేతలు అవహేళన చేశారని, ఇప్పుడేమో సీఎం కేసీఆర్‌ పాలన దక్షతను చూసి ఆయన చిత్రపటానికి అక్కడి ప్రజలు పాలతో అభిషేకాలు చేస్తున్నారని మంత్రి కేటీ రామారావు అన్నారు. 

ఆంధ్రాలో టీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేయాలని స్వయంగా కలిసి విజ్ఞప్తులు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రైతుబంధు అమలు తర్వాత మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ జిల్లాలోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారని అన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి ఇది ఉదాహరణ మాత్రమేనని అన్నారు. 

నల్లగొండకు చెందిన పలువురు మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర నేతలు శనివారం టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించడమే ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు పనిగా పెట్టుకున్నారని అన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి స్థానిక కాంగ్రెస్‌ నేతలకు కనిపించడం లేదని, అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల నేతలకు, మంత్రులకు కనిపిస్తోందని చెప్పారు.
 
అసమర్థ, దివాళాకోరు, భావ దారిద్య్ర రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ కాంగ్రెస్‌ అని ఆయన వ్యాఖ్యానించారు.నల్లగొండ కాంగ్రెస్‌ నేతలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు.

loader