ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు దిక్కరణ కేసులో ప్రభుత్వాధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది.

వివరాల్లోకి వెళితే... 2018లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌ భూసేకరణ విషయంలో రైతుల అభ్యంతరాలు ఏమాత్రం వినకుండా అధికారులు డిక్లరేషన్, అవార్డు ఇచ్చారని కొంతమంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ డిక్లరేషన్, అవార్డును రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది.

Also Read:మల్లన్నసాగర్ ఇష్యూ: రెవిన్యూ అధికారులకు జైలు, సస్పెన్షన్

ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని రైతులందరికీ తెలపాలని, అభ్యంతరాలు పరిగణనలోనికి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వులను అధికారులు ఏమాత్రం పాటించకుండా డిక్లరేషన్, అవార్డు ప్రకటించారని 2019లో మరోసారి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు రూ.2,000 జరిమానా విధించింది. దీనిని నాలుగు వారాల్లో చెల్లించకుంటే నెల రోజులు జైలు శిక్ష పడుతుందని కోర్టు ఆదేశించింది.

Also Read:బినామీ చేతుల్లోకి మల్లన్నసాగర్ నిర్వాసితుల పరిహారం

అలాగే సిద్ధిపేట ఆర్డివో జయచందర్ రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. దీంతో పాటు 12 మంది పిటిషనర్లకు రూ.2 వేలు చెల్లించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. అధికారులను శిక్షించాలనే ఉద్దేశ్యంతో తాము ఈ కేసులు పెట్టలేదని, కేవలం వారు చేసిన భూసేకరణ ప్రక్రియ తప్పని చెప్పడానికే కోర్టును ఆశ్రయించామని రైతులు తెలిపారు.