Asianet News TeluguAsianet News Telugu

గ్రేటర్లో అధికార పార్టీకి షాక్... బిజెపి గూటికి టీఆర్ఎస్ కార్పోరేటర్

జిహెచ్ఎంసి ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. 

TRS Party Carporator Joins BJP in hyderabad
Author
Hyderabad, First Published Nov 9, 2020, 2:16 PM IST

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్దమవుతున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. హైదరాబాద్ కు చెందిన కొందరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో కాషాయా కండువా కప్పుకున్నారు. 

నగరంలోని మైలార్ దేవ్ పల్లి టీఆర్ఎస్ కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు తోకల శ్రీశైలం రెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు బీజేపీ లో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారావు, సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

READ MORE  ఇంటికి వెళ్లి విజయశాంతిని కలిసిన మాణిక్యం ఠాగూర్

మరోవైపు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి బిజెపిలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన ప్రకటనలో కాంగ్రెసు పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆ విషయంపై సంకేతాలు ఇస్తుండగా, మరో పరిణామం కూడా చోటు చేసుకుంది. బిజెపిలో చేరడానికి ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉందని అంటున్నారు. 

బిజెపి నాయకత్వంతో ఆమె ఇప్పటికే మూడు సార్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఇటీవల ఆమెతో భేటీ అయ్యారు. అయితే విజయశాంతి కుటుంబ సభ్యులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని, తాను పండుగ సందర్భంగా విజయశాంతిని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని కిషన్ రెడ్డి అంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేదని కూడా చెప్పారు. కానీ ఆ మాటలను ఎవరూ విశ్వసించడం లేదు.

 కాగా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు విజయశాంతితో సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై బిజెపి చేస్తున్న పోరాటాలను ఆమె ప్రశంసించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బండి సంజయ్ ప్రదర్శిస్తున్న దూకుడు కూడా తెలంగాణ రాములమ్మకు నచ్చినట్లు చెబుతున్నారు. 

ఆ భేటీలకు ముందే ఆమె బిజెపి జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది.  బిజెపి అధ్యక్ష పదవిని చేపట్టిన సందర్భంగా అభినందించడానికి మాత్రమే విజయశాంతి నడ్డాను కలిసినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే, బిజెపిలో చేరడానికి సుముఖంగా ఉండడం వల్లనే నడ్డాతో ఆమె సమావేశమైనట్లు చెబుతున్నారు. 

ఇటీవల బండి సంజయ్ విజయశాంతిని ప్రశంసించడం కూడా చర్చనీయాంశంగా మారింది. విజయశాంతి గొప్ప నాయకురాలని, తెలంగాణ ఉద్యమకారులకు చేసినట్లే విజయశాంతికి కూడా కేసీఆర్ అన్యాయం చేశారని ఆయన అన్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే విజయశాంతి బిజెపిలోకి ప్రవేశించడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
  

Follow Us:
Download App:
  • android
  • ios