హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ సినీ నటి, పార్టీ నేత విజయశాంతిని కలిశారు. ఆయన విజయశాంతి ఇంటికి వెళ్లారు. విజయశాంతిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విజయశాంతి బిజెపిలో చేరుతారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిజెపి నేత జి. కిషన్ రెడ్డి విజయశాంతిని కలిసిన నేపథ్యంలో ఆమె కాంగ్రెసుకు రాజీనామా చేస్తారనే ప్రచారం ముమ్మరమైంది. ఈ విషయంపై విజయశాంతి మాత్రం ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. 

Also Read: విజయశాంతి బిెజెపిలో ఎప్పుడు చేరుతోందో తెలియదు: బండి సంజయ్

విజయశాంతి పార్టీ మారుతారనే ప్రచారం నేపథ్యంలో ఇటీవల కాంగ్రెసు నేత కుసుమ కుమార్ కూడా విజయశాంతితో భేటీ అయ్యారు. విజయశాంతి కాంగ్రెసులోనే ఉంటారని భేటీ తర్వాత ఆయన అన్నారు. కరోనా కారణంగానే ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆయన చెప్పారు. 

విజయశాంతి దుబ్బాక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం, పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరించడం కూడా పుకార్లకు బలం చేకూర్చాయి. బుధవారం గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీకి కూడా విజయశాంతి దూరంగానే ఉన్నారు. కోర్ కమిటీ భేటీ ముగిసిన తర్వాత మాణిక్యం ఠాకూర్ విజయశాంతి ఇంటికి బయలుదేరి వెళ్లారు. 

Also Read: ఉత్కంఠకు తెర.. విజయశాంతి కాంగ్రెస్‌లోనే: తేల్చి చెప్పిన కుసుమ కుమార్

తెలంగాణ కోర్ కమిటీ భేటీలో దుబ్బాక శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో సంభవించిన పరిణామాలపై, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే పార్టీ నేతల నుంచి డిపాజిట్ వసూలు చేయాలని కోర్ కమిటీ నిర్ణయించింది. జనరల్ సీట్లకు పోటీ పడాలనుకునేవారి నుంచి రూ. 10 వేలేసి, ఇతర డివిజన్ల నుంచి పోటీ చేసేవారి నుంచి ఐదు వేల రూపాయల చొప్పున వసూలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.