TRS MPs protest: తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపుతోందన్న టీఆర్‌ఎస్ ఎంపీలు.. పార్లమెంట్‌లో నిరసన
తెలంగాణలో ధాన్యం సేకరణకు (Paddy procurement) సంబంధించి కేంద్ర క్లారిటీ ఇవ్వాలని టీఆర్‌ఎస్ (TRS) ఎంపీలు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ అంశాన్ని పార్లమెంట్ (Parliament) ఉభయసభలలో ప్రస్తావించిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. నిరసన తెలిపారు.
తెలంగాణలో ధాన్యం సేకరణకు(Paddy procurement) సంబంధించి కేంద్ర క్లారిటీ ఇవ్వాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణకకు సంబంధించి పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే లోక్‌సభలో టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. ఈ క్రమంలోనే లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఇతర సభ్యులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరికి నిరసనగా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహాం వద్ద నిరసన చేపట్టారు. తెలంగాణ రైతులను శిక్షించవద్దని వారు ఫ్లకార్టులు ప్రదర్శించారు.
తెలంగాణ భవన్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన టీఆర్‌ఎస్ ఎంపీలు.. తెలంగాణలో ధాన్యం సేకరణపై కేంద్రం వివక్ష చూపుతుందని ఆరోపించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ ఎంపీ కే కేశవరావు చేశారు. పంజాబ్‌కు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు. ‘సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించుకున్న తర్వాత మిగిలిన ధాన్యం ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. ఎఫ్‌సీఐ సేకరణతో రైతులకు భద్రత ఉంటుంది. కనీస మద్దతు ధర తక్కువగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సార్లు భర్తీ చేసింది. ఎప్పుడైనా ఖరీఫ్ సీజన్‌లో వచ్చే రా రైస్ ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. వానాకాలంలో రాష్ట్రంలో 1.2 కోట్ల టన్నుల ధాన్యం పండింది. రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. రాష్ట్రంలో పండిన ధాన్యం తీసుకోవాలని కోరితే కేంద్రం పట్టించుకోవడం లేదు’ అని తెలిపారు.
Also read: నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు: ఆమోదం తెలిపిన రాజ్యసభ
రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం ఇది అని విమర్శించారు. పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలని కే కేశవరావు డిమాండ్ చేశారు. ఎంఓయు ప్రకారం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం అంటుందని చెప్పారు. కానీ మొత్తం కోటి టన్నుల ధాన్యం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్పష్టత ఇస్తే పంటల మార్పిడి అంశాన్ని రైతులకు వివరిస్తామని అన్నారు. రెండు మూడేళ్ళ సమయం ఇస్తే పంట మార్పిడి వైపు రైతులు మళ్లుతారని చెప్పారు. అంతవరకు బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్టుగా తెలిపారు. కేంద్రం కొనుగోలు చేయకపోవడం వల్ల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కేంద్రం వైఖరి వల్ల తెలంగాణకు రైతాంగానికి నష్టం జరగుతుందని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. 60 రోజుల క్రితం కేంద్ర మంత్రులను కలిస్తే నాలుగు రోజుల్లో చెబుతామని అన్నారు.. కానీ ఇప్పటికి స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ‘ముఖ్యమంత్రి కెసిఆర్ 3 రోజులు ఇక్కడే ఉంది కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. రైతులను, తెలంగాణను, తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అవమాన పరుస్తుంది. ఇంత అధిక పంట ఎలా పండుతుంది అని కేంద్రం అడుగుతుంది. ఏడేండ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రైతాంగాన్ని బలోపేతం చేశాం. పంట సాగు, ఉత్పత్తి పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ రైతాంగ సమస్యలు లెవనెత్తుతాం. కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత తీసుకురావాలి. తెలంగాణ ఎంపీలంతా ఉభయ సభల్లో కలిసి పోరాడాలి’ అని నామా నాగేశ్వరరావు అన్నారు.
Also read: Parliament winter session: పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
ఇక, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణలో వరి ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం, ధాన్యం సేకరణలో కేంద్రం వివక్షపై చర్చించాలని టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. రూల్ 267 కింద తక్షణమే ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై లోక్‌సభలో నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ధాన్యం సేకరణలో కేంద్రం వివక్షపై చర్చ చేపట్టాలని కోరారు. అయితే ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు తిరస్కరణకు గురయ్యాయి.