వెంకయ్యను అభినందించిన టిఆర్ఎస్ ఎంపిలు తెలుగు ప్రజలకు వెంకయ్య సేవలనుకొనియాడిన ఎంపిలు వెంకయ్య నామినేషన్ పత్రాలపై సంతకం చేసిన జితేందర్ రెడ్డి

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడి పేరు ఖరారు కావడంతో ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ వెంకయ్యనాయుడికి పోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేత కే.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డితో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలంతా ఢిల్లీలో వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

దేశ ఉపరాష్ట్రపతిగా ఆయన ఎంపిక తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు. తాజాగా ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలకు రాష్ట్రపతి ఆమోదం లభించడంలో ఆయన పాత్ర మరువలేనిదని గుర్తుచేసుకున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుకోసం కేంద్ర మంత్రిగా ఆయన చొరవను వారు ప్రశంసించారు.

ఎన్డీయే అభ్యర్థిగా వెంకయ్యనాయుడు నామినేషన్ పత్రాలపై టీఆర్‌ఎస్ తరపున లోక్‌సభా పక్ష నేత జితేందర్‌రెడ్డి సంతకం చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ ఎంపీలు కవిత, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాల్క సుమన్, ప్రొఫెసర్ సీతారాం నాయక్ తదితరులు వెంకయ్యనాయుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.