న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రైతులకు మద్దతు ధర కల్పిస్తోందా అని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు ప్రశ్నించారు.

రాజ్యసభ వాయిదా పడిన తర్వాత టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె.కేశవరావు  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.రైతులకు గిట్టుబాటు ధర పెరుగుతుందని బీజేపీ ఎలా చెప్పగలదని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ కేంద్ర ప్రభుత్వానికి పూర్తి పక్షపాతంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

also read:రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్‌పై అవిశ్వాసం: 12 పార్టీల నోటీసు

వ్యవసాయరంగాన్ని కార్పోరేటికరణ చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. విపక్షాల పట్ల రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మెన్ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ప్రతిపక్షాలు సవరించిన నిబంధనలను వ్యతిరేకంగా డిప్యూటీ ఛైర్మెన్ తోసిపుచ్చారని ఆయన గుర్తు చేశారు.

డిప్యూటీ ఛైర్మెన్ తీరును నిరసిస్తూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించినట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయంలో మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు.

రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లులపై  ఓటింగ్ జరిగే సమయంలో విపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వాయిస్ ఓటుతో బిల్లులను రాజ్యసభ ఆమోదం పొందింది.