8 ఏళ్ల క్రితం పార్లమెంట్‌ ఘోర తప్పిదం చేసినట్టు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ద్వారానే మన దేశం నడుస్తోందని కేశవరావు అన్నారు. పార్లమెంట్‌ ద్వారానే మన దేశం నడుస్తోందని కేకే చెప్పారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ (narendra modi) కొత్త వివాదాలకు తెరతీస్తున్నారని టీఆర్ఎస్ (trs) ఎంపీ కె.కేశవరావు (keshav rao) అన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీ విభజనపై రాజ్యసభలో ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 8 ఏళ్ల క్రితం పార్లమెంట్‌ ఘోర తప్పిదం చేసినట్టు ప్రధాని మోడీ మాట్లాడారని.. పార్లమెంట్‌ ద్వారానే మన దేశం నడుస్తోందని కేశవరావు తెలిపారు. ప్రధాని స్థాయిలో మోడీ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌ ప్రొసీడింగ్‌ (parliament proceedings) చూసేది రాష్ట్రపతి, మొత్తం సభ అని... సభలో ఏది జరిగినా సభ్యులు నిబంధనల ప్రకారమే నడుచుకుంటారని కేకే గుర్తుచేశారు.

రాజ్యాంగంలోని నియమాల ప్రకారమే సభ నడుస్తోందని.. పార్లమెంట్‌ ప్రొసీడింగ్స్‌ను న్యాయస్థానంలో కూడా సవాల్‌ చేయలేమని కేశవరావు తెలిపారు. ప్రధానిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చామని.. సభ ప్రొసీజర్స్‌ను, ప్రొసీడింగ్స్‌ను మోడీ సవాల్‌ చేస్తున్నారని కేకే మండిపడ్డారు. పార్లమెంట్‌ ప్రొసీడింగ్స్‌ను ప్రశ్నించే హక్కు మోడీకి లేదని.. 8 ఏళ్ల తర్వాత సభలోని అంశాలపై అనుమానాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా వుందన్నారు. బీజేపీ ప్రభుత్వమే ఇప్పుడు ఎన్నో నిబంధనలు ఉల్లంఘిస్తోందని.. పార్లమెంట్‌ను కించపరిచే విధంగా మోడీ వ్యాఖ్యలు చేయడం తగదని కేశవరావు హితవు పలికారు. దేవాలయంగా భావించే పార్లమెంట్‌పై ఇలాంటి విమర్శలు చేయడం బాధాకరమన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్‌లో ఆందోళనకు దిగింది. సాయంత్రం 4 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. ఆ పార్టీ ఎంపీలు వెల్‌లోకి దూసుకువెళ్లి నిర‌స‌న చేప‌ట్టారు. ఇప్పటికే ప్ర‌ధాని మోడీపై టీఆర్ఎస్ పార్టీ స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చింది. లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాతో పాటు లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌కు ఆ నోటీసులు అంద‌జేశారు ఎంపీలు. ఈ నేపథ్యంలోనే ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు ప్ల‌కార్డుల‌తో వెల్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో ఎంపీలు ఆందోళ‌న నిర్వ‌హించారు.

అంతకుముందు ఉద‌యం రాజ్య‌స‌భ‌లోనూ టీఆర్ఎస్ ఎంపీలు ప్ర‌ధాని మోదీపై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌లో తెలంగాణ ఎంపీలు స‌భ నుంచి వాకౌట్ కూడా చేశారు. అయితే ప్రివిలేజ్ నోటీసుపై చైర్మన్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని డిప్యూటీ చర్మెన్ హ‌రివంశ్ తెలిపారు.