ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంపై విమర్శలు చేశారు టీఆర్ఎస్ ఎంపీ కేకే. వరి పండించిన రైతులను ఆదుకోవాలని.. తెలంగాణలో వచ్చే రబీలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కేకే కోరారు.  

కేంద్రం తప్పుడు వాదనలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు టీఆర్ఎస్ ఎంపీ కే. కేశవరావు (k keshava rao) . అందుకే ఈ నెల 11న ఢిల్లీలో నిరసనలు చేస్తున్నామన్నారు. బాయిల్డ్ రైస్‌కు (boiled rice) కూడా విదేశాలలో డిమాండ్ వుందని ఆయన చెప్పారు. కానీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం, మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారని కేకే ఆరోపించారు. వరి పండించిన రైతులను ఆదుకోవాలని కేశవరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో వచ్చే రబీలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని కేకే కోరారు. మాపై కత్తి పెట్టి అగ్రిమెంట్ చేశారని కేశవరావు ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను కోరామని.. రైతులకు సాయం చేయాల్సిన అవసరం వుందని కేకే చెప్పారు. కేంద్రం ఫాసిస్ట్ పద్ధతిలో వ్యవహరిస్తోందని.. తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్ష కట్టిందని ఆయన మండిపడ్డారు. 

యాసంగి సీజన్‌లో పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు (paddy procurement) చేయరాదన్న కేంద్రం నిర్ణయంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి, జెండాలు చేతబూని ప్రధాని నరేంద్రమోడీ కి (narendra modi) వ్య‌తిరేకంగా నిన‌దించారు. కేంద్ర బీజేపీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఆందోళ‌న‌లు ఉధృతంగా నిర్వ‌హిస్తున్నారు. ప్రతి వరి గింజను కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చేంత వరకు తమ నిరసనను కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రబీ సీజన్‌లో రాష్ట్రం నుంచి పూర్తి స్థాయిలో వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర శాసనసభ్యులు జిల్లా కేంద్రంలో నిరసనలకు నాయకత్వం వహించారు.

మొత్తం 33 జిల్లాల్లో జరిగిన నిరసనల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో పార్టీ జెండాలు, వరి మొక్కలు పట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్ర‌ధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ప్రతి వరి గింజను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని టీఆర్‌ఎస్ నేతలు పున‌రుద్ఘాటించారు. సిరిసిల్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పరిశ్రమలు, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ (ktr), ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు.