Asianet News TeluguAsianet News Telugu

సజ్జలవి సాదాసీదా మాటలు కాదు... అప్పడు బాబుతో, ఇప్పుడు వైసీపీతో కలిసి మోడీ కుట్రలు : పల్లా

తెలంగాణపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. నాడు చంద్రబాబుతో, ఇప్పుడు వైసీపీ నేతలతో కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా మోడీ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 

trs mlc palla rajeshwar reddy response on ysrcp leader sajjala ramakrishna reddy comments
Author
First Published Dec 8, 2022, 5:36 PM IST

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిసిపోవాలంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజనకు తామంతా వ్యతిరేకమని, కోర్టుల్లో కేసులు వేశామని విషపు మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనను మళ్లీ వెనక్కి తిప్పాలని కూడా అంటున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. 

తెలంగాణ వస్తే చీకట్లో వుంటుందని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలు అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, మత కల్లోలాలు చోటు చేసుకుంటాయని అన్నారని పల్లా గుర్తుచేశారు. అనేక మంది తెలంగాణ వాళ్లకు తినడం రాదు, పంట పండించడం రాదు, ఉద్యోగం చేయడం రాదు.. అందువల్ల తామే అన్నీ నేర్పిస్తున్నామని అప్పట్లో వ్యాఖ్యానించారని రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అన్నింటినీ పటాపంచలు చేస్తూ 2014 నుంచి 2022 వరకు తెలంగాణ ప్రయాణం ఏ విధంగా జరిగిందో ప్రజల అనుభవంలో వుందన్నారు. 

Also REad:కుదిరితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా విధానం: ఉండవల్లి వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్

2014లో తెలంగాణ పుట్టి పుట్టకముందే నాడు చంద్రబాబు .. మోడీతో కలిసి ఏడు మండలాలను తీసుకున్నాడంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణకు విద్యుత్ సమస్యలు వున్నాయని తెలిసి కూడా మోడీ సీలేర్ పవర్ ప్రాజెక్ట్‌ను దొంగతనంగా లాక్కున్నారని ఆయన ఆరోపించారు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణపై మోడీ దుమ్మెత్తిపోస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు సాయం చేయకపోగా.. స్వయంగా తల్లిని చంపి బిడ్డను ఇచ్చారంటూ రాష్ట్ర విభజనను కించపరిచారని ఆయన ఎద్దేవా చేశారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి విషపు ఆలోచనతోనే మాట్లాడారని, ఆయన సాదాసీదాగా ఈ మాటలు అన్నట్లు తాము అనుకోవడం లేదన్నారు. బెర్లీన్ గోడను బద్ధలు కొట్టి జర్మనీ ఒక్కటి కాలేదా అని నాడు చంద్రబాబు మాట్లాడారని, మోడీ దన్నుతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పల్లా ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ నేతలతో కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా మోడీ కుట్ర చేస్తున్నారని రాజేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios