కుదిరితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా విధానం: ఉండవల్లి వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్
ఏపీ మళ్లీ ఉమ్మడిగా కలిసి ఉండాలనేది తమ విధానమని ఏపీ రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు
విజయవాడ:కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.నిన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శలపై గురువారంనాడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇవాళ తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానమని ఆయన స్పష్టం చేశారు.రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే దానికోసం వైకాపా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ తమ పార్టీ పోరాడుతుందన్నారు.ఉండవల్లి అరుణ్ కుమార్ పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ,బీజేపీలు విభజనకు అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేస్తోంది వైసీపీ మాత్రమేనన్నారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే తొలుత స్వాగతించేది తామేనన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వాదనలు వినిపిస్తామన్నారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలన్నారు. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదన్నారు.విభజనచట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని ఆయన చెప్పారు.
also read:అలా చేస్తే ఏపీకి జగన్ అన్యాయం చేసినట్టే: ఉండవల్లి అరుణ్ కుమార్
నిన్నటి జయహో బీసీ సభకు 80 వేల పైగా మంది బీసీ ప్రతినిధులు హాజరైనట్టుగా ఆయన చెప్పారుస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గడానికి టీడీపీనే కారణమన్నారు. ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ ను అడ్డుకున్నట్టుగా చెప్పారు. రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా చంద్రబాబు ఉన్నారని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో ఎస్సీ, మైనార్టీలతో సభలు పెడతామన్నారు.స్కిల్ డెవలప్ మెంట్ లో అక్రమాలపై విచారణ జరుగుతుందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ అక్రమాలు చేశారనే స్పష్టమైన ఆధారాలున్నాయని ఆయన చెప్పారు.