తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితే గెలుచుకుంటుందని ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పుర పోలింగ్ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజల మనోభావాలను గుర్తించి ఆ మేరకు అభ్యర్థులను నిలబెట్టడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పోరేషన్‌లలో ఓటర్లు టీఆర్ఎస్‌కు మద్ధతుగా నిలిచారని పల్లా చెప్పారు.

Also Read:మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు కొరికిన కాంగ్రెస్ అభ్యర్థి

కరీంనగర్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ కారుదే ఘన విజయం సాధిస్తుందని రాజేశ్వర్ రెడ్డి ధీమా చేశారు. అభ్యర్ధుల విజయం కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

మరోవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల వరకు 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 మున్సిపల్ కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిలబడిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7613 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసింది. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు.

Also Read:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు వారిని శాంతింపజేశారు. అక్కడక్కడా ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది.