హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో ఆ సంఘటన జరిగింది. బోధన్ లోని 32వ వార్దులో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

దొంగ ఓట్లు వేస్తున్నారని టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ అభ్యంతరం చెప్పారు. ఆ కోపంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇలాయిస్ అతని ముక్కు కొరికాడు. దీంతో ఇమ్రాన్ ముక్కు రక్తమోడింది. రక్తస్రావం జరగడంతో ఇమ్రాన్ ను ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణలో బుదవారంనాడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. చెదురుమొదరు సంఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కరెంట్ సరఫరా లేకపోవడంతో 7వ వార్డులోని 13వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అరగంట ఆలస్యంగా మొదలైంది. 

ఓటర్లను గుర్తించేందుకు ఎన్నికల సంఘం తొలిసారిగా కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. కొంపల్లిలోని 10వ పోలింగ్ కేంద్రంలో అధికారులు ఫేస్ రికగ్నేషన్ యాప్ ను వాడుతున్ారు. 

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గంజిపేట పోలింగ్ కేంద్రం వద్ద మజ్లీస్ నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెసు కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కాంగ్రెసు నాయకుడు శంకర్ కాలికి గాయమైంది. అతన్ని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కామారెడ్డి పరిధిలోని ఎల్చిపూర్ లో ముక్కుపుడకలు పంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి కాంగ్రెసు పార్టీ తరఫున ముక్కుపుడకలు పంచినట్లు పోలీసులు తెలిపారు.