తెలంగాణలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే పలువరు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ మహమ్మారి బారిన పడగా తాజాగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి కూడా పాజిటివ్  గా నిర్దారణ అయ్యింది. 

వికారాబాద్: తెలంగాణలో కరోనా (corona) మహమ్మారి మరోసారి కలకలం సృష్టిస్తోంది. గతకొన్నిరోజులుగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. సామాన్యులు మొదలు సీనీ,రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. 

ఇక అధికార పార్టీకి చెందిన మరికొందరు నాయకులు సైతం కరోనాబారిన పడ్డారు. మంత్రి ఎర్రబల్లి దయాకరరావు, ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డిలకు సైతం కరోనా సోకింది. దీంతో వారంతా హోంక్వారంటైన్ అయ్యారు.

ఇదిలావుంటే తెలుగు సీనీపరిశ్రమను కరోనా కలవరపెడుతోంది. ప్రముఖ నటుడు మహేష్ బాబు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. అలాగే డైరెక్టర్ అనుదీప్, నటి మంచు లక్ష్మీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కూడా కరోనా బారినపడి హోంక్వారంటైన్ లోకి వెళ్లారు.

రాష్ట్రంలో కరోనా కేసులు కూడా ఇటీవల గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో (శనివారానికి) 73,156 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,606 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,92,357కి చేరుకుంది. 

కోవిడ్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 4,041కి చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా మరో 285 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 12,180 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1583 కేసులు నమోదయ్యాయి.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 16, జీహెచ్ఎంసీ 1583, జగిత్యాల 8, జనగామ 1, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 6, కామారెడ్డి 11, కరీంనగర్ 27, ఖమ్మం 41, మహబూబ్‌నగర్ 22, ఆసిఫాబాద్ 6, మహబూబాబాద్ 53, మంచిర్యాల 38, మెదక్ 8, మేడ్చల్ మల్కాజిగిరి 292, ములుగు 0, నాగర్ కర్నూల్ 19, నల్గగొండ 16, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 35, పెద్దపల్లి 19, సిరిసిల్ల 7, రంగారెడ్డి 214, సిద్దిపేట 16, సంగారెడ్డి 59, సూర్యాపేట 13, వికారాబాద్ 8, వనపర్తి 9, వరంగల్ రూరల్ 6, హనుమకొండ 45, యాదాద్రి భువనగిరిలో 18 చొప్పున కేసులు నమోదయ్యాయి.

మరోవైపు దేశంలో ఒక్క రోజులోనే ఏకంగా దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. Covid-19 మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి థ‌ర్డ్ వేవ్ భ‌యం ప్ర‌జ‌లు మ‌రింత‌గా ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌తి. గ‌త 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా కొత్త‌గా 1,41,986 కేసులు నమోదయ్యాయి.