మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) శాసనసభ్యుడు శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొరల కాలం ఇంకా ఎంత కాలం నడుస్తుందో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు తాను ఏం మాట్లాడినా తప్పే అంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

మామిడి రైతుల సమావేశంలో సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రధాన కార్యాలయాలు ఉంటే అభివృద్ధి జరుగుతుందని శంకర్ నాయక్ అన్నారు. ఏం రాజ్యాంగమో.. ఎవరు కనిపెట్టారో తెలియదు గానీ.... అన్నం పెట్టే రైతుకు ప్రతిసారీ అన్యాయమే జరుగుతోందని ఆయన అన్నారు. 

అన్నం లేకుంటే జీవించలేరని, ఆ విషయం ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసునని, అన్నం పెట్టే రైతును మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులను మోసం చేయడం ఎంతో దురదృష్టకరమని ఆయన అన్నారు. రైతులను మోసం చేసేవారికి ఉరిశిక్ష వేయాలని ఆయన అన్నారు. 

గుండుపిన్ను నుంచి వస్తువులను తయారు చేసేవారేవారు ధరలను నిర్ణయిస్తారని, రైతులకు మాత్రం ఆ అవకాశం లేదని ఆయన అన్నారు. శంకర్ నాయక్ ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో సత్యవతి రాథోడ్ పక్కనే ఉన్నారు.