టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టగా.. ఎమ్మెల్యే కారు ఎగిరిపడింది. 

టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును అక్కన్నపేట వద్ద మరో వాహనం ఢీకొట్టింది. దీంతో భారీ శబ్ధంతో ఎమ్మెల్యే వాహనం ఎగిరిపడింది. ప్రమాద సమయంలో పద్మా దేవేందర్ రెడ్డి కారులోనే వున్నట్లుగా తెలుస్తోంది. వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. మెదక్ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం టీపీసీసీ (tpcc) చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి (revanth reddy) తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సంగతి తెలిసిందే. ఆయన కాన్వాయ్‌కి పెనుప్రమాదం తప్పింది. తూప్రాన్ మండలం ఇమాంపూర్‌ వద్ద కాన్వాయిలోని కార్లు ఒక్కదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాలుగు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఆదివారం ‘మన ఊరు .. మన-పోరు’ (Mana Ooru-Mana Poru ) బహిరంగ సభను కామారెడ్డి జిల్లా (kama reddy) ఎల్లారెడ్డిలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సభకు రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వెళ్తుండగానే రేవంత్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ మరో వాహనంలో ఎల్లారెడ్డికి వెళ్లారు.