మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయకుండా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ టీఆర్ఎస్ నేతలు గాదరి కిశోర్, బడుగుల లింగయ్య యాదవ్‌లు ఆదివారం ఎన్నికల సంఘాన్ని కోరారు. 

రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరడానికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని స్వయంగా ఆయన చెప్పారని అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్. ఆదివారం కోమటిరెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం గాదరి కిశోర్ మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డిని అనర్హుడి గా ప్రకటించాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ఎన్నికల అధికారిని కలిశామన్నారు. రాజగోపాల్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వారిని ప్రోత్సహించొద్దని ఎన్నికల అధికారిని కోరామని గాదరి కిశోర్ తెలిపారు. ఈటెల రాజేందర్‌కి వివేక్‌కి కూడా వాటా ఇస్తామని చెప్పాడట అంటూ ఆయన ఆరోపించారు. 

రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఆత్మగౌరవాన్ని మోడీ అమిత్ షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడని గాదరి కిశోర్ దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తికి ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇస్తారని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల కోసం ఏనాడు పని చేయలేదని పైసలున్నాయన్న అహంకారం ఉందని గాదరి కిశోర్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి బిజెపి వాళ్లు కృత్రిమ ఎన్నిక తెచ్చారని ఆయన ఆరోపించారు. రాజగోపాల్ రెడ్టి, బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని... ఇలాంటి దొంగలను ప్రజలు తరిమికొడతారని గాదరి కిశోర్ జోస్యం చెప్పారు. మునుగొడులో ఎగిరెది గులాబీ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ALso REad:రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే బీజేపీలోకి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బిజెపి నుండి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు ఓ టీవీ ఛానెల్‌లో స్వయంగా చెప్పాడన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య అని.. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌ని గాలికి వదిలేశారని ఆయన దుయ్యబట్టారు. ఇచ్చిపుచ్చుకోవడం కింద ఇలాంటి పనులు చేశారని ఎన్నికల ప్రధాన అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామని ఎంపీ తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగొడులో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలంటూ ఎన్నికల అధికారిని కోరినట్లు లింగయ్య స్పష్టం చేశారు. కాంట్రాక్ట్‌లో వచ్చిన డబ్బులతో మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.