కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. అమ‌రవీరుల స్థూపం ముందు నుంచే వెళ్లిన రాహుల్ గాంధీ నివాళులర్పించలేదని ఆయనకు కనీస పోరాట పటిమ లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్‌కి, కిషన్ రెడ్డికి పడటం లేదని బాల్క సుమన్ ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీ (congress) , రాహుల్ గాంధీపై (rahul gandhi) ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (balka suman) . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నిక‌ల‌కు ముందే కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోంద‌ని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంద‌ని, అమరవీరులు, దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాగుతున్నారంటూ బాల్క సుమన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ (kcr) కుటుంబంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు ఏమాత్రం లేద‌ని ఆయన పేర్కొన్నారు. త‌మ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ ప‌దే ప‌దే అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తోంద‌ని, వాళ్ల దగ్గర అవినీతికి సంబంధించిన‌ ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థల దగ్గరకు ఎందుకు వెళ్ల‌డం లేద‌ని బాల్క సుమన్ ప్ర‌శ్నించారు. అస‌లు రాహుల్ గాంధీకి పోరాట పటిమే లేద‌ని ... వ‌రంగ‌ల్ వేదిక‌గా రైతు డిక్ల‌రేష‌న్ (warangal declaration) అంటూ.. రైతుల పట్ల మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారంటూ ఫైరయ్యారు. ఛత్తీస్‌ఘడ్‌లో రైతులకు రెండు గంటల కరెంటు రావడం లేదని, రుణమాఫీ కూడా లేద‌ని ఆరోపించారు. 

అమ‌రవీరుల స్థూపం ముందు నుంచే వెళ్లిన రాహుల్ గాంధీ… క‌నీసం నివాళులు కూడా అర్పించ‌లేద‌ని బాల్క సుమ‌న్ మండిపడ్డారు. నివాళులు అర్పించ‌లేని కాంగ్రెస్‌కు, అమరవీరులు, అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అమ‌ర‌వీరుల స్థూపం ద‌గ్గ‌రికి వెళ్లి, అవినీతి విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని బాల్క సుమ‌న్ ధ్వజమెత్తారు. అమరవీరుల స్థూపం మొత్తం ఖర్చు రూ.177 కోట్లు అని, ఇందులో పన్నులే 27 కోట్లు అని ఆయ‌న స్పష్టం చేశారు. ఇప్పటికి రూ.100 కోట్ల ప‌నులు జ‌రిగాయ‌ని.. అకాల వర్షాల వల్ల యాదాద్రిలో (yadadri rain) పనుల్లో ఇబ్బందులు వస్తే అవినీతి అంటున్నార‌ని బాల్కసుమన్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వర్షాలు వస్తే తిరుమలలో ఎన్ని సార్లు రోడ్లు కొట్టుకుపోలేదని బాల్క సుమన్ ప్రశ్నించారు. 2004 లో తెలంగాణ ఇస్తామని చెప్పి తమతో పొత్తు పెట్టికొని మీరు మోసం చేస్తే తాము రాజీనామా చేసి బయటకు వచ్చామని ఆయన గుర్తుచేశారు. బీజేపీలో (bjp) రెండు గ్రూపులు అయ్యాయని.. కిషన్ రెడ్డికి (kishan reddy) బండి సంజయ్‌కి (bandi sanjay) పడటం లేదని బాల్క సుమన్ ఆరోపించారు. గ్రూపుల లొల్లి పడలేకే బండి సంజయ్ యాత్రలు చేస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తున్న కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి చేసిందేమి లేదని బాల్క సుమన్ దుయ్యబట్టారు. అభివృద్ధి అంటే టిఆర్ఎస్... అవినీతి అంటే కాంగ్రెస్.. ఉన్మాదం అంటే బీజేపీ అని ఆయన అభివర్ణించారు.