టీఆర్ఎస్ నేత, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు హన్మకొండ హంటర్‌ రోడ్డులో వున్న క్యాంపు కార్యాలయాన్ని బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు కూల్చివేశారు.

వరంగల్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాలు నీట మునగడంతో ఇందుకు నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలే కారణమని గుర్తించారు.

అధికారుల పరిశీలనలో ఆరూరి రమేశ్ క్యాంప్ కార్యాలయం కూడా ఉన్నట్లు తేల్చారు. దీంతో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ ఆదేశాలతో డీఆర్ఎఫ్ సిబ్బంది రమేశ్ కార్యాలయాన్ని పాక్షికంగా తొలగించారు.

కాగా, నాలా విస్తరణ కోసం కార్యాలయ భవనాన్ని తొలగించడానికి ఎమ్మెల్యే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని రమేశ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కాగా, ఇటీవల భారీ వర్షాల కారణంగా వరంగల్‌లో చోటు చేసుకున్న పరిస్ధితులను మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించారు.

నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మంత్రి ఆదేశాలతో నగరంలోని నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు, ప్రహారీల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

దీనిలో భాగంగా భద్రకాళి, ములుగురోడ్డు, నయింనగర్ నాలాలపై వున్న 22 ఆక్రమణలను అధికారులు తొలగించారు. ఇప్పటి వరకు వరంగల్ వ్యాప్తంగా 88 ఆక్రమణలను కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.