నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలంటూ బీజేవైఎం కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. డౌన్ డౌన్న కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

నిన్న తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి సైతం నిరుద్యోగుల నుంచి నిరసన సెగ తగిలింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనుమల మండలం కొత్తపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు మద్దతుగా మంత్రి ప్రచారం చేపట్టారు. అయితే కరోనా కారణంగా గత ఏడాదికాలంగా స్కూల్స్ మూతపడటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ ప్రైవేట్ టీచర్ నుండి ఆయనకు నిరసన సెగ తగిలింది. 

Also Read:మంత్రి జగదీశ్ రెడ్డికి నిరసన సెగ... నడిరోడ్డుపై నిలదీసిన టీచర్

మంత్రి జగదీశ్ రెడ్డిని నడిరోడ్డుపై అడ్డుకున్న ఓ ప్రైవేట్ టీచర్... నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశాడు. అయితే మంత్రి కూడా సదరు టీచర్ కు ఘాటుగా జవాభిచ్చాడు. ''నీలాంటి వాళ్లను చాలామందిని చూశాం... నిన్ను ఎవరు పంపించారో తెలుసు... నీతో పాటు మీ నాయకులపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తాం'' అని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. 

ఈ క్రమంలో మంత్రిని మరేదో విషయంపై ప్రశ్నించాలని సదరు టీచర్ భావించగా పోలీసులు రంగప్రవేశం చేశారు. వెంటనే ప్రైవేట్ టీచర్ ను పక్కకు లాక్కునివెళ్లగా మంత్రి జగదీశ్ రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగించారు.