సూర్యాపేట: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ శాసనసభా నియోజకవర్గానికి అభ్యర్థిని ఎంపిక చేయడం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకత్వానికి తలకు మించిన భారమైనట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శంకరమ్మ సైదిరెడ్డికి టికెట్ దక్కకుండా కొలికి పెట్టారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి అయిన శంకరమ్మ గత కొంత కాలంగా తనకే హుజూర్ నగర్ టికెట్ కావాలంటూ పట్టుబడుతూ వచ్చారు. 

తాజాగా, తనకు టికెట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు గానీ శానంపూడి సైదిరెడ్డికి మాత్రం ఇవ్వకూడదనే డిమాండుతో ముందుకు వస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే మరో ఎన్నారై అప్పిరెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆమె టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డిపై వ్యతిరేకతతో ఆమె శానంపూడి సైదిరెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఇంత కాలం అంటూ వచ్చారు. 

గత కొంత కాలంగా శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గం టికెట్ తనకు లభిస్తుందని చెబుతూ విస్తృత ప్రచారం చేసుకుంటూ, సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆయన అదే నమ్మకంతో ప్రచార సామగ్రిని కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చి సైదిరెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం టికెట్ ఖరారు చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ టికెట్ అప్పిరెడ్డి అనే ఎన్నారైకి ఇవ్వాలని ఆమె తాజాగా పట్టుబడుతున్నారు. 

ఇదిలావుంటే, హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన సాముల శివారెడ్డి తనకే టికెట్ కావాలని అడుగుతున్నారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి తనకు కేసీఆర్‌ టికెట్‌ ఇస్తారని ఆశిస్తున్నానని, ఇవ్వకుంటే రెబల్‌గా పోటీ చేస్తానని శివారెడ్డి హెచ్చరించారు. 

సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన బల ప్రదర్శన సభలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను ఓడించే శక్తి తనకొక్కడికే ఉందన్నారు. తనకు టికెట్‌ రాకుండా కొందరు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

ఉత్తమ్ కు కేసిఆర్ చెక్: హుజూర్ నగర్ బరిలో ఎన్నారై

ఉత్తమ్ పై పోటీ ఎవరు: ఎన్నారైకి టీఆర్ఎస్ సీటు దక్కేనా?

టీఆర్ఎస్ టికెట్ రాకుంటే ప్రాణత్యాగమే...ఆ మంత్రి వల్లే పెండింగ్ : శంకరమ్మ

‘‘నాకు టికెట్ ఇవ్వకుంటే.. సూసైడ్ చేసుకుంటా’’