ఉత్తమ్ కు కేసిఆర్ చెక్: హుజూర్ నగర్ బరిలో ఎన్నారై

KCR check to Uttam: NRI may be fileded against him
Highlights

తమ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనని దీక్ష పట్టిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గంలోనే చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు.

సూర్యాపేట: తమ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయనని దీక్ష పట్టిన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గంలోనే చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. ఆయనపై ఎన్నారైని పోటీకి దించేందుకు కేసీఆర్ సిద్ధపడినట్లు చెబుతున్నారు.

కెనడాలో హోటల్ బిజినెస్ లో ఉన్న శానంపూడి సైది రెడ్డి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ దించాలని కేసిఆర్ భావిస్తున్నారు. నియోజకవర్గంలో పనిచేసుకోవాల్సిందిగా కేసీఆర్ శానంపూడి సైదిరెడ్జికి కేసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది.

దీంతో శానంపూడి సైదిరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా యువతను తనవైపు ఆకర్షించేందుకు యువ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

టీఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జీగా కాసోజు శంకరమ్మ ప్రస్తుతం కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆమెనే పోటీ చేశారు. ఆమెపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదు వేలకు పైగా మెజారిటీతో మాత్రమే విజయం సాధించారు. అయితే, సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బలమైన అభ్యర్థి కాగలరని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

జిల్లా జగదీశ్వర్ రెడ్డికి సైదిరెడ్డి సన్నిహితుడు కూడా. హుజూర్ నగర్ జగదీష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ సైదిరెడ్డిని తనతో పాటు ఆ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. దాంతో సైదిరెడ్డిని మరింత విస్తృతంగా ప్రజలకు పరిచయం చేస్తున్నారు.

ఇదిలావుంటే, సైదిరెడ్డి తండ్రి అంకిరెడ్డి గతంలో గుండ్లపల్లి సర్పంచ్ గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో మఠంపల్లి మండలం ప్రధాన నాయకుడిగా కూడా వ్యవహరిస్తూ వచ్చారు. మఠంపల్లి మండల కేంద్రంలోనూ పెదవీడు వంటి చుట్టుపక్కల గ్రామాల్లోను సైదిరెడ్డి బంధువర్గం విశేషంగా ఉంది. దానికితోడు, మఠంపల్లి కేంద్రంలో సైదిరెడ్డి మేనమామ మన్నెంశ్రీనివాస్ రెడ్డి, సైదిరెడ్డి ఏళ్లతరబడిగా రాజకీయాల్లో ఉన్నారు. దానికితోడు, మాజీ శాసనసభ్యుడు వేనేపల్లి చందర్ రావు అండదండలు సైదిరెడ్డికి ఉన్నాయి. 

అవన్నీ సైదిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తాయని, ఉత్తమ్ కుమార్ రెడ్డి సైదిరెడ్డి గట్టి పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. సైదిరెడ్డిని పోటీకి దించితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేయకుండా హుజూర్ నగర్ కే పరిమితం చేయవచ్చుననే ఆలోచన కూడా కేసీఆర్ మదిలో ఉన్నట్లు చెబుతున్నారు. తాను గెలవడానికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కువ శ్రమించాల్సి వస్తుందని, దానివల్ల రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో పర్యటించడానికి అంత వీలు చిక్కకపోవచ్చునని అంటున్నారు. 

loader